లక్ష్యం కివీస్‌107 పరుగులు... భారత్‌ 10 వికెట్లు! | New Zealand aim for victory | Sakshi
Sakshi News home page

లక్ష్యం కివీస్‌107 పరుగులు... భారత్‌ 10 వికెట్లు!

Published Sun, Oct 20 2024 3:56 AM | Last Updated on Sun, Oct 20 2024 3:57 AM

New Zealand aim for victory

విజయంపై న్యూజిలాండ్‌ గురి 

పోరాడేందుకు టీమిండియా సిద్ధం 

రెండో ఇన్నింగ్స్‌లో భారత్‌ 462 

సర్ఫరాజ్‌ 150, రిషభ్‌ పంత్‌ 99 

మూడు రోజులుగా మలుపులతో టెస్టు క్రికెట్‌ మజాను చూపించిన బెంగళూరు మ్యాచ్‌ ఆసక్తికర ముగింపునకు చేరింది... తప్పులు సరిదిద్దుకొని రెండో ఇన్నింగ్స్‌లో చెలరేగిన భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌ ప్రదర్శన వెంటాడింది... ఫలితంగా న్యూజిలాండ్‌ ముందు 107 పరుగుల అతి స్వల్ప లక్ష్యం... కాపాడుకోవాల్సిన పరుగులు తక్కువే కానీ ప్రత్యర్థి బౌలర్లు చెలరేగిన చోట మన బౌలర్లు నిలువరించలేరా, కుప్పకూల్చలేరా... బుమ్రా వేసిన తొలి నాలుగు బంతులు ఇదేనమ్మకాన్ని కలిగించాయి... అయితే చివరి రోజు బౌలింగ్‌తో పాటు వాతావరణం, పిచ్‌ కూడా మనకు కలిసి రావాలి!  

35.1 ఓవర్లలో 177 పరుగులు...సర్ఫరాజ్, పంత్‌ భాగస్వామ్యం శనివారం భారత అభిమానులను అలరించింది...ఈ జోడీ మెరుపు బ్యాటింగ్‌తో భారీ లక్ష్యాన్ని నిర్దేశించే దిశగా జట్టు సాగుతున్నట్లు అనిపించింది... సర్ఫరాజ్‌ ఖాన్‌ కెరీర్‌లో తొలి సెంచరీతో మ్యాచ్‌ను చిరస్మరణీయం చేసుకోగా, శతకం చేజారినా...పంత్‌ చేసిన 99 పరుగులు ప్రత్యేకంగా నిలిచాయి. అయితే న్యూజిలాండ్‌ తీసుకున్న కొత్త బంతి భారత్‌ రాత మార్చింది. 408/3తో పటిష్టంగా కనిపించిన టీమ్‌ 54 పరుగులకే తర్వాతి 7 వికెట్లు కోల్పోయింది. దాంతో మ్యాచ్‌ మళ్లీ కివీస్‌ వైపు మొగ్గింది.  

బెంగళూరు: భారత్‌ గడ్డపై 36 ఏళ్ల తర్వాత టెస్టు మ్యాచ్‌ నెగ్గేందుకు న్యూజిలాండ్‌ రంగం సిద్ధం చేసుకుంది. ప్రత్యర్థి ముందు భారత్‌ కేవలం 107 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి 4 బంతులే ఎదుర్కొన్న కివీస్‌ పరుగులేమీ చేయలేదు. వెలుతురులేమి, ఆపై వాన కారణంగా అంపైర్లు ముందుగానే ఆటను నిలిపివేయాల్సి వచ్చింది. 

శనివారం 51.1 ఓవర్ల ఆట మాత్రమే సాగింది. అంతకు ముందు భారత్‌ తమ రెండో ఇన్నింగ్స్‌లో 99.3 ఓవర్లలో 462 పరుగులకు ఆలౌటైంది. సర్ఫరాజ్‌ ఖాన్‌ (195 బంతుల్లో 150; 18 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో చెలరేగగా...రిషభ్‌ పంత్‌ (105 బంతుల్లో 99; 9 ఫోర్లు, 5 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. రూర్కే, హెన్రీ చెరో 3 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశారు.  

భారీ భాగస్వామ్యం... 
ఓవర్‌నైట్‌ స్కోరు 231/3 వద్ద సర్ఫరాజ్, పంత్‌ నాలుగో రోజు ఉదయం జత కలిశారు. అక్కడినుంచి కివీస్‌ బౌలర్లపై వీరిద్దరి ఆధిపత్యం కొనసాగింది. ఒకరితో మరొకరు పోటీ పడుతూ పరుగులు సాధించగా...కివీస్‌ బౌలర్లంతా చేతులెత్తేశారు. లేట్‌ కట్, ర్యాంప్‌ షాట్లతో సర్ఫరాజ్‌ పరుగులు రాబట్టగా, స్లాగ్‌ స్వీప్‌లతో పంత్‌ విరుచుకుపడ్డాడు. 

ఒక దశలో 16 బంతుల వ్యవధిలో సర్ఫరాజ్‌ 5 ఫోర్లు బాదాడు. ఆ తర్వాత సౌతీ బౌలింగ్‌లో డీప్‌ కవర్‌ దిశగా కొట్టిన ఫోర్‌తో అతని సెంచరీ పూర్తయింది. ఆ తర్వాత పంత్‌ తన జోరును ప్రదర్శించారు. సౌతీ ఓవర్లో సిక్స్, ఫోర్‌ కొట్టిన అతను... పటేల్‌ ఓవర్లో 2 సిక్స్‌లు, ఫోర్‌తో చెలరేగాడు. ఆ తర్వాత 55 బంతుల్లో అతను హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. 

అయితే నిర్ణీత లంచ్‌ సమయానికి కాస్త ముందే ఆరంభమైన వర్షం...ఆ తర్వాతా కొనసాగడంతో ఆటకు అంతరాయం కలిగింది. ఆ తర్వాత ఆట మొదలయ్యాక వీరిని నిలువరించడంతో కివీస్‌ బౌలర్ల వల్ల కాలేదు. ఎట్టకేలకు కొత్త బంతి ఆ జట్టుకు కలిసొచ్చింది.  

అదే వైఫల్యం... 
150 పరుగులు పూర్తి చేసుకున్న వెంటనే సర్ఫరాజ్‌ను అవుట్‌ చేసి సౌతీ భారత్‌ పతనానికి శ్రీకారం చుట్టాడు. సౌతీ తర్వాతి ఓవర్లో సిక్స్‌తో పంత్‌ 96కు చేరుకున్నాడు. అయితే దురదృష్టం అతడిని వెంటాడింది. 99 పరుగుల వద్ద రూర్కే వేసిన బంతిని డ్రైవ్‌ చేయబోగా...అతని బ్యాట్‌ను తగిలి బంతి స్టంప్స్‌పై పడింది. 

చిన్నస్వామి స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించగా, పంత్‌ నిరాశగా వెనుదిరిగాడు. ఆ తర్వాత భారత అభిమానులు మరింత నిరాశ చెందే సమయం వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లాగే అదే వరుసలో రాహుల్‌ (12), జడేజా (5), అశ్విన్‌ (15) విఫలమయ్యారు. ఆ తర్వాత ఒకే ఓవర్లో హెన్రీ రెండు వికెట్లు తీసి భారత్‌ కథ ముగించాడు.  

పంత్‌ రనౌట్‌ అయి ఉంటే... 
సర్ఫరాజ్, పంత్‌ భాగస్వామ్యంలో ఒకే ఒక్క సారి కివీస్‌కు మంచి అవకాశం వచ్చింది. పంత్‌ 6 పరుగుల వద్ద ఉన్నప్పుడు సునాయాసంగా రనౌట్‌ చేసే అవకాశాన్ని జట్టు చేజార్చుకుంది. హెన్రీ వేసిన బంతిని పంత్‌ గల్లీ దిశగా ఆడగా సింగిల్‌ పూర్తి కాగా, రెండో పరుగు కోసం పంత్‌ బాగా ముందుకొచ్చేశాడు. 

సర్ఫరాజ్‌ వారించడంతో అతను వెనక్కి వెళ్ళాడు కానీ క్రీజ్‌కు చాలా దూరంగా ఉన్నాడు. అయితే బంతిని అందుకునేందుకు తన స్థానం నుంచి చాలా దూరం జరిగిన కీపర్‌ బ్లన్‌డెల్‌ తన వెనక ఉన్న పరిస్థితిని గుర్తించలేకపోయాడు. అతను సరైన చోట ఉంటే పంత్‌ అక్కడే వెనుదిరిగేవాడు! 

107 గతంలో 107 లేదా అంతకంటే తక్కువ ల„ ్యాన్ని సొంతగడ్డపై భారత్‌ ఒకే ఒక సారి కాపాడుకుంది. 2004లో స్పిన్‌కు బాగా అనుకూలించిన ముంబై టెస్టులో 107 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 93 పరుగులకే కుప్పకూలింది.  

7 టెస్టుల్లో పంత్‌ 90ల్లో అవుట్‌ కావడం ఇది ఏడో సారి. అతని ఖాతాలో 6 సెంచరీలు ఉన్నాయి.  

7 భారత్‌ తరఫున ఈ టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి అత్యధికంగా ఏడుగురు డకౌట్‌ అయ్యారు. గతంలో ఇలాంటి ప్రదర్శన 1952లో (ఇంగ్లండ్‌పై) నమోదైంది.  

స్కోరు వివరాలు:  
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 46; న్యూజిలాండ్‌ తొలి ఇన్నింగ్స్‌ 402; భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (స్టంప్డ్‌) బ్లన్‌డెల్‌ (బి) పటేల్‌ 35; రోహిత్‌ (బి) పటేల్‌ 52; కోహ్లి (సి) బ్లన్‌డెల్‌ (బి) ఫిలిప్స్‌ 70; సర్ఫరాజ్‌ (సి) పటేల్‌ (బి) సౌతీ 150; పంత్‌ (బి) రూర్కే 99; రాహుల్‌ (సి) బ్లన్‌డెల్‌ (బి) రూర్కే 12; జడేజా (సి) యంగ్‌ (బి) రూర్కే 5; అశ్విన్‌ (ఎల్బీ) (బి) హెన్రీ 15; కుల్దీప్‌ (నాటౌట్‌) 6; బుమ్రా (సి) బ్లన్‌డెల్‌ (బి) హెన్రీ 0; సిరాజ్‌ (సి) సౌతీ (బి) హెన్రీ 0; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (99.3 ఓవర్లలో ఆలౌట్‌) 462. వికెట్ల పతనం: 1–72, 2–95, 3–231, 4–408, 5–433, 6–438, 7–441, 8–458, 9–462, 10–462. బౌలింగ్‌: సౌతీ 15–2–53–1, హెన్రీ 24.3–3–102–3, విలియమ్‌ రూర్కే 21–4–92–3, ఎజాజ్‌ పటేల్‌ 18–3–100–2, ఫిలిప్స్‌ 15–2–69–1, రచిన్‌ 6–0–30–0.  
న్యూజిలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌: లాథమ్‌ (బ్యాటింగ్‌) 0; కాన్వే (బ్యాటింగ్‌) 0; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (0.4 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 0.  బౌలింగ్‌: బుమ్రా 0.4–0–0–0.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement