
ఆసియా క్రీడల టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత పురుషుల జట్టు చరిత్రాత్మక గెలుపుతో రికార్డు పుస్తకాలకెక్కింది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సత్యన్ జ్ఞానశేఖరన్, ఆచంట శరత్ కమల్, హర్మీత్ దేశాయ్,ఆంథోనీ అమల్‌రాజ్‌లతో కూడిన భారత జట్టు 3–1తో ప్రపంచ రెండో ర్యాంకర్ జపాన్‌పై సంచలన విజయం సాధించింది. 1958 ఏషియాడ్ నుంచి కనీసం ఒక్క పతకమైనా నెగ్గని భారత్ ఈసారి ఏకంగా సెమీఫైనల్స్‌కు చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది.
క్వార్టర్స్ తొలి మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ 11–9, 11–9, 11–7తో యుడా జిన్‌పై నెగ్గి శుభారంభం అందించగా... రెండో మ్యాచ్‌లో శరత్ కమల్ 11–8, 12–10, 11–8తో మసుదైరా కెంటాను మట్టికరిపించి ఆధిక్యాన్ని 2–0కు పెంచాడు. మూడో మ్యాచ్‌లో హర్మీత్ దేశాయ్ 11–9, 12–14, 11–8, 8–11, 4–11తో యొషిడా మసాకి చేతిలో ఓడిపోయాడు. అయితే నాలుగో మ్యాచ్‌లో సత్యన్ జ్ఞానశేఖరన్ విజృంభించి 12–10, 6–11, 11–7, 11–4తో కెంటాను ఓడించి భారత విజయాన్ని ఖాయం చేశాడు. మంగళవారం జరిగే సెమీఫైనల్లో దక్షిణ కొరియాతో భారత్; చైనీస్ తైపీతో చైనా తలపడతాయి. సెమీస్‌లో ఓడిన జట్లకు కాంస్యాలు లభిస్తాయి. మరోవైపు భారత మహిళల జట్టు క్వార్టర్ ఫైనల్లో 1–3తో హాంకాంగ్ చేతిలో ఓడిపోయింది.