రియో డీ జనీరో: రియో ఒలింపిక్స్లో టాప్ సీడ్గా బరిలోకి దిగిన సెరెనా విలియమ్స్ మూడో రౌండ్కు చేరుకుంది. మూడో రోజు ఆటలో భాగంగా సోమవారం రాత్రి జరిగిన మహిళల సింగిల్స్ టెన్నిస్ పోరులో సెరెనా 7-6(5), 6-2తేడాతో అలైజ్ కార్నెట్(ఫ్రాన్స్)పై గెలిచి మూడో రౌండ్లోకి ప్రవేశించింది. తొలి సెట్లో కార్నెట్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదుర్కొన్న సెరెనా టై బ్రేక్ ద్వారా గట్టెక్కింది. అనంతరం రెండో సెట్లో సెరెనా ఎటువంటి తప్పిదాలు చేయకుండా కార్నెట్ను కంగుతినిపించింది.
ఇప్పటికే నాలుగు ఒలింపిక్స్ స్వర్ణ పతకాలు సాధించిన సెరెనా.. మరో పసిడి దిశగా సాగుతోంది. అయితే ఈ పోరు తరువాత మాట్లాడిన సెరెనా.. ఆటలో ఎదురయ్యే ఒత్తిడిని అధిగమించే అవసరం ఉందని పేర్కొంది. కార్నెట్ తో జరిగిన మ్యాచ్లో కొన్ని పొరపాట్లు చేసినట్లు పేర్కొంది. తాను చేసిన కొన్ని అనవసర తప్పిదాల కారణంగానే తొలి సెట్ టైబ్రేక్ కు దారితీసినట్లు నల్లకలువ తెలిపింది. మరోపోరులో స్పెయిన్ క్రీడాకారిణి గార్బెన్ ముగురుజా 6-1, 6-1 తేడాతో హిబినో(జపాన్)పై గెలిచింది.