
'నా ఎజెండాలో రిటైర్మెంట్ ను చేర్చలేదు'
రియోడీ జనీరో: ఆరో ఒలింపిక్ స్వర్ణంపై కన్నేసిన అమెరికా నల్లకలువ, ప్రపంచ అగ్రశ్రేణి టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తన రిటైర్మెంట్ గురించి వస్తున్న వార్తలను ఖండించింది. తనకు ఇప్పుడే ఆట నుంచి దూరమయ్యే ఆలోచనే లేదని స్పష్టం చేసింది. ఇటీవల వింబుల్డన్ టైటిల్ను గెలిచి 22 గ్రాండ్ స్లామ్లతో స్టెఫీ గ్రాఫ్ రికార్డును సమం చేసిన సెరెనా.. వీడ్కోలు నిర్ణయం అనేది ఇంకా తన ఎజెండాలో చేర్చలేదని స్పష్టం చేసింది.
'టెన్నిస్ ను ప్రేమిస్తాను. దాంతో పాటు కోర్టులో ఆడటాన్ని ఆరాధిస్తాను. పోటీని ఎదుర్కొవడం అంటే నాకు ఇష్టం. ఇంకా రిటైర్మెంట్ ఆలోచన చేయలేదు. ఆ వార్తల్లో కూడా నిజం లేదు. అలా వీడ్కోలు చెప్పడాన్ని కూడా స్వాగతించలేనేమో. ఒకవేళ ఆ సమయం వస్తే కచ్చితంగా చెబుతాను. సాధ్యమైనంతవరకూ విజయాలు సాధించడంపై ప్రస్తుతం నా దృష్టి ఉంది' అని రియో ఒలింపిక్స్ కు సన్నద్ధమైన 34 ఏళ్ల సెరెనా పేర్కొంది.