టీమిండియా వెంట పడతారెందుకు?
కరాచీ: భారత్ తో యూఏఈలో డిసెంబర్ లో జరగాల్సిన సిరీస్ పై ఇంకా నీలి నీడలు వీడలేదు. ఈ సిరీస్ పై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఆసక్తి కనబరుస్తున్నా.. బీసీసీఐతో చర్చలు ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. అయితే భారత పర్యటనపై పాకిస్థాన్ ట్వంటీ 20 కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది తనదైన శైలిలో స్పందించాడు. ఇప్పటివరకూ బీసీసీఐ నుంచి ఎటువంటి స్పష్టతా లేని నేపథ్యంలో వారి వెంట పడటం అనవసరమని ఆఫ్రిది పేర్కొన్నాడు. ఈ మేరకు తన సలహాను పీసీబీకి తెలియజేసిన ఆఫ్రిది అనంతరం లాహోర్ లో మీడియాతో మాట్లాడాడు. పాకిస్థాన్ తో సిరీస్ కు భారత్ ను ఆహ్వానించే క్రమంలో చర్చలను ఇక వదిలి పెట్టి.. మిగతా టీమ్ లను స్వదేశానికి ఆహ్వానిస్తే బాగుంటుందని ఆఫ్రిది తెలిపాడు.
'టీమిండియాతో ఎక్కువ క్రికెట్ ఆడాల్సిన అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. పాకిస్థాన్ పదే పదే టీమిండియాను సంప్రదించడం సరైన విధానం కాదనేది నా అభిప్రాయం. అసలు వారికి ఇష్టం లేనప్పుడు ..పీసీబీ మాత్రమే వారిని ఎందుకు కలవాలి. ప్రస్తుతం టీమిండియాతో సిరీస్ గురించి చర్చలు ఆపేసి.. వేరే దేశాలను పాకిస్థాన్ పర్యటనకు ఆహ్వానించండి' అని ఆఫ్రిది బోర్డుకు తెలిపాడు. 2007 తరువాత ఓ సిరీస్ లో భాగంగా 2012-13 వ సంవత్సరంలో భారత పర్యటనకు పాకిస్థాన్ వచ్చింది. ఆ తరువాత ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు. కాగా, ఇరుదేశాల ఒప్పందం ప్రకారం 2015 నుంచి 2023 వరకూ ఆరు సిరీస్ లు జరగాల్సి ఉంది. అయితే పదే పదే కాల్పుల విరమ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్ తో సిరీస్ లు జరపడానికి బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయడం లేదు.