షాహిద్ అఫ్రిది
లార్డ్స్ : అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసే ఉద్దేశమే లేదని పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది స్పష్టం చేశాడు. గురువారం ఐసీసీ నిర్వహించిన చారిటీ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుకు అఫ్రిది సారథ్యం వహించాడు. కరీబియన్ దీవుల్లో హరికేన్ కారణంగా దెబ్బ తిన్న స్టేడియాల పునరుద్ధరణకు నిధుల సేకరణ నిమిత్తం ఐసీసీ ఈ మ్యాచ్‌ను నిర్వహించింది. ఈ మ్యాచ్ సందర్భంగా మైదానంలో హడావిడి చేసిన కామెంటేటర్ నాసర్ హుస్సెన్ అఫ్రిదిని ‘అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేసే ఆలోచనలో ఉన్నారా?’ అని ప్రశ్నించాడు. దీనికి అఫ్రిదీ ‘అలాంటిదేం లేదు, నా పరిస్థితి చూడు గాయాలతో ఎలా ఉన్నానో అని నవ్వుతూ బదులిచ్చాడు’.
మరిచిపోలేని ఘటన..
ఈ మ్యాచ్‌తో అఫ్రిదికి జీవితంలో మరిచిపోలేని ఘటన ఎదురైంది. ఆటగాళ్ల నుంచి సముచిత గౌరవం లభించింది. మ్యాచ్ ప్రారంభం ముందు వరల్డ్ ఎలెవన్ ఆటగాళ్లు చప్పట్లతో అఫ్రిదికి స్వాగతం పలికారు. దీనిపై ఈ 38 ఏళ్ల ఆటగాడు సంతోషం వ్యక్తం చేశాడు. ‘ఇది చాలా ప్రత్యేకం. నా జీవితంలో మరిచిపోలేను. క్రికెట్ కుటుంబంలో జరిగింది. అద్భుతం. సాయం చేయడానికి వచ్చిన అందరికి ధన్యవాదాలు’ అని తెలిపాడు. అఫ్రిది 20,000 యూఎస్ డాలర్లను హరికేన్ రిలీఫ్ ఫౌండేషన్‌కు విరాళంగా ప్రకటించాడు. ఇక ఆటగాళ్లంతా తమ ఫీజును డొనేట్ చేశారు. లార్డ్స్ వేదికగా ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుపై 72 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment