
విజయానందంలో వెస్టిండీస్ జట్టు
లండన్ : ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో వరల్డ్ ఎలెవన్ జట్టుపై 72 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. హరికేన్ కారణంగా దెబ్బతిన్న మైదానాల పునరుద్ధరణకు నిధులు సేకరించే నిమిత్తం లండన్‌లోని లార్డ్స్ మైదానంలో ఈ చారిటీ టీ-20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ జట్టు ఆద్యంతం అద్భుతమైన ప్రదర్శన కనబర్చింది. మొదట బ్యాటింగ్ చేసిన కరేబియన్లు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేశారు. చెలరేగి ఆడిన ఎవిన్ లెవిస్ 26 బంతుల్లో 58 పరుగులు చేశాడు. షాహిద్ ఆఫ్రిదీ నేతృత్వంలో బరిలోకి దిగిన వరల్డ్ ఎలెవన్ జట్టు.. 200 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడంలో చతికిలపడింది. ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. థిసరా పేరారా ఒక్కడే రాణించి 61 పరుగులు చేశాడు. మిగతా ఆటగాళ్లు చేతులు ఎత్తేయడంతో 127 పరుగులకు వరల్డ్ ఎలెవన్ చాప చుట్టేసింది. దీంతో టీ-20 చాంపియన్స్ వెస్టిండీస్ జట్టు భారీ విజయాన్ని అందుకుంది. అద్భుతంగా రాణించిన ఎవిన్ లెవిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ దక్కింది.