
షకీబ్ ‘రికార్డు’ డబుల్ సెంచరీ
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే, టి20 సిరీస్‌ల్లో దారుణ పరాజయాలు ఎదుర్కొన్నా... తొలి టెస్టులో మాత్రం బంగ్లాదేశ్ దీటుగా ఆడుతోంది. సీనియర్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ (217; 31 ఫోర్లు) తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీతో పాటు బంగ్లా తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. దీంతో పాటు కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ (159; 23 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ సాధించడంతో బంగ్లా తమ తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు ఆట ముగిసే సమయానికి 136 ఓవర్లలో 7 వికెట్లకు 542 పరుగుల భారీ స్కోరు సాధించింది. 154/3 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు బరిలోకి దిగిన బంగ్లా దూకుడుగా ఆడింది.
82 ఓవర్లపాటు సాగిన బంగ్లా బ్యాట్స్‌మెన్ జోరుతో కివీస్ బౌలర్లు బేజారెత్తారు. షకీబ్, రహీమ్ ఐదో వికెట్‌కు 359 పరుగులు జోడించారు. బంగ్లా తరఫున ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. అలాగే కివీస్‌పై ఏ జట్టు తరఫునైనా ఐదో వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఓవర్‌కు 4.4 పరుగులతో దూసుకెళ్లడంతో బంగ్లా ఒక్క రోజే 388 పరుగులు సాధించింది. ఆట ముగియడానికి 15 నిమిషాల ముందు షకీబ్ అవుటయ్యాడు. వాగ్నర్‌కు మూడు, బౌల్ట్.. సౌతీలకు రెండేసి వికెట్లు దక్కాయి.