టీమిండియా: వాళ్లు ఇప్పుడైనా ఆడుతారా?
టాప్ ఆర్డర్ బాగా రాణించకపోతే కష్టమేనంటున్న రవిశాస్త్రి
విరాట్ కోహ్లి మినహా టీమిండియా టాప్ ఆర్డర్ వరుసగా విఫలమవుతూ వస్తున్నది. టీ20 వరల్డ్ కప్‌లో చాలామంది టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ పెద్దగా రాణించలేదు. గురువారం సెమీస్‌లో ప్రమాదకరమైన విండీస్ జట్టుకు ఢీకొంటున్న తరుణంలో ఇప్పటికైనా టీమిండియా బ్యాట్స్‌మన్ తమ ప్రదర్శనను మెరుగుపరుచుకోవాలని టీమ్ డైరెక్టర్ రవిశాస్త్రి స్పష్టం చేశాడు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. 'సెమీస్ వంటి కీలక పోరులో టాప్ ఆర్డర్ భారీగా రాణించాల్సిన అవసరముంటుంది.. ఈ టోర్నమెంటులో ఇప్పటివరకు మేం 70శాతం ప్రదర్శన మాత్రమే చూపాం. ఇంకా మెరుగుపడి.. మిగితా 30 శాతం సామర్థ్యాన్ని కూడా చూపాలని ఆశిస్తున్నా'నని చెప్పారు. రేపటి సెమీఫైనల్ ప్రధాన బ్యాట్స్ మెన్ భారీ ప్రదర్శన ఇస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు.
ఓపెనర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మ ఇప్పటివరకు భారీ ఓపెనింగ్ పునాది ఇవ్వడంలో ఘోరంగా విఫలమయ్యారు. ఈ టోర్నమెంటులోని గత నాలుగు మ్యాచ్‌లలో వరుసగా 5, 14, 42, 23 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం అందించింది. వీరు వరుసగా విఫలమవుతుండటం మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ మీద తీవ్ర ఒత్తిడి పెంచుతున్నది. ఇక నాలుగోస్థానంలో బ్యాటింగ్ చేస్తున్న లెఫ్ట్ హ్యాండర్ సురేష్ రైనా జట్టుకు ఏమాత్ర ఉపయోగపడటం లేదు. అతను గత ఐదు మ్యాచ్‌లలో 1, 0, 30, 10 పరుగులు మాత్రమే చేశాడు. టీ20 వరల్డ్ ట్యాప్ ర్యాంకులో ఉన్న కోహ్లి రెండు అర్ధ సెంచరీలు చేయడం ద్వారా జట్టు విజయాలలో కీలక పాత్ర పోషించాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి ఒక్కడి మీద ఆధారపడి విజయాలు సాధించడం కష్టమని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 'ఒకరిద్దరు ఆటగాళ్ల మీద ఆధారపడటం కుదరదు. కనీసం ఐదారుగురు ఆటగాళ్లైన ఆడేందుకు సిద్ధంగా ఉండాలి. అది ఇప్పటివరకు జరుగలేదు. కనీసం సెమీస్‌లోనై జరుగుతుందని ఆశిద్దాం' అని రవిశాస్త్రి చెప్పాడు. విండీస్ చాలా ప్రమాదకరమైన జట్టు అని, ఆ జట్టు 230 పరుగుల లక్షాన్ని కూడా అలవోకగా ఛేదించిందనే విషయాన్ని గుర్తుచేశాడు. కాబట్టి సెమీస్ పోరుకు అందరూ సర్వసన్నద్ధంగా ఆడేందుకు, ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉండాలని టీమిండియాకు సూచించాడు.