
అది దేశానికిచ్చే గౌరవం: ధావన్
విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు దేశంలోని 46 సెంట్రల్ యూనివర్శిటీల్లో జాతీయ జెండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ మద్దతు పలికాడు.
న్యూఢిల్లీ:విద్యార్థుల్లో జాతీయ భావం పెంపొందించేందుకు దేశంలోని 46 సెంట్రల్ యూనివర్శిటీల్లో జాతీయ జెండాను నిర్ణీత ఎత్తులో తప్పకుండా ఎగురవేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భారత క్రికెటర్ శిఖర్ ధావన్ మద్దతు పలికాడు. అది దేశానికిచ్చే గౌరవమని శిఖర్ ఈ సందర్భంగా తెలిపాడు. ' నా దృష్టిలో యూనివర్శిటీల్లో జాతీయ జెండాను ఎగరవేయడమనేది మంచి కార్యక్రమం. జాతీయ జెండా అంటే దేశ గౌరవమే. అది చాలా సున్నితత్వంతో కూడుకున్నది. యూనివర్శిటీల్లో జాతీయ జెండా ఎగురవేస్తే ఎప్పడూ దేశం గురించి అగౌరవంగా మాట్లాడే ప్రసక్తే ఉండదు. గత రాత్రి ప్రొ-కబడ్డీ లీగ్ జరిగే ముందు జాతీయ గీతం ఆలాపిస్తున్నారు. ఆ సమయంలో మ్యాచ్ ను చూస్తున్న నేను కూడా నిలబడి జాతీయ గీతాన్ని ఆలపించా. దేశం తరపున ఆడే అవకాశం నాకు రావడం నిజంగా నా అదృష్టం' అని శిఖర్ పేర్కొన్నాడు. దేశ పౌరులుగా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలంటే మనం చేసే పనులు కూడా సక్రమంగా ఉండాలని శిఖర్ అభిప్రాయపడ్డాడు.
సెంట్రల్ వర్సిటీల్లో ప్రతిరోజూ 207 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకం ఎగరేయాలని వీసీల సమావేశం నిర్ణయించిన సంగతి తెలిసిందే. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ నేతృత్వంలో సూరజ్‌కుండ్‌లో జరిగిన సెంట్రల్ వర్సిటీల వీసీల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. తొలి పతాకాన్ని జేఎన్‌యూలో ఎగురవేయనున్నారు. ఇప్పటికే వర్సిటీల్లో జాతీయ జెండా ఎగురుతున్నా..అన్ని చోట్లా జాతీయ జెండా ఎత్తు సమానంగా ఉండాలని తీర్మానంలో నిర్ణయించారు.