న్యూయార్క్: పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్, రావల్పిండి ఎక్స్ప్రెస్ షోయబ్ అక్తర్ సచిన్ కెప్టెన్సీలో క్రికిట్ ఆడబోతున్నందుకు సంతోషం వ్యక్తం చేశాడు. అమెరికాలోని న్యూయార్క్, హ్యూస్టన్, లాస్ ఎంజిల్స్లలో జరగనున్న మూడు టీట్వంటీ ఆల్ స్టార్స్ క్రికెట్ టోర్నీలో సచిన్ జట్టులో అక్తర్ ఆడనున్నాడు. టాస్ వేయడం ద్వారా ఆటగాళ్లను సచిన్ బ్లాస్టర్స్, వార్న్ వారియర్స్ జట్లు పంచుకున్నాయి. ఈ సందర్భంగా అక్తర్కు సచిన్ జట్టులో ఆడే అవకాశం వచ్చింది. దీనిపై అక్తర్ మాట్లాడుతూ.. 'థ్యాంక్ గాడ్ సచిన్ జట్టలో క్రికెట్ ఆడబోతున్నాను, అతని కెప్టెన్సీని నేనెప్పుడూ దగ్గరగా చూడలేదు' అని సంతోషం వ్యక్తం చేశాడు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్ల సందర్భంగా గతంలో సచిన్కు ప్రత్యర్థిగా బౌలింగ్ చేసిన ఈ ఫాస్ట్ బౌలర్ ఆల్ స్టార్స్ టోర్నీలో మ్యాచ్ సందర్భంగా తనకు సచిన్ ఎలాంటి సలహాలు, వ్యూహాలు అందిస్తాడో చూడాలని ఆతృతగా ఉన్నాడు. సచిన్కు బౌలింగ్ చేస్తే చూడాలని ప్రజలు కోరుకుంటారని తెలుసు గానీ తనకు మాత్రం అతని కెప్టెన్సీలో ఆడాలని ఉన్నట్లు తెలిపాడు.