లలిత్ మోడికి షాక్
ఆర్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి తొలగింపు
జైపూర్: రాజస్థాన్ క్రికెట్ సంఘం (ఆర్‌సీఏ)లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోడిని ఆర్‌సీఏ అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఈ మేరకు శనివారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 33 జిల్లా సంఘాలకుగాను 23 సంఘాలు మోడిని తొలగించడాన్ని సమర్థించాయి. ఈ ఎత్తుగడను ముందుండి నడిపిన స్థానిక బీజేపీ నాయకుడు అమిన్ పఠాన్‌ను తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.
మోడి అనుచరులు పవన్ గోయల్ (కోశాధికారి), మహ్మద్ అబ్ది (ఉపాధ్యక్షుడు)లపై కూడా వేటు పడింది. బీసీసీఐ నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఐదు నెలల కిందట మోడి ఆర్‌సీఏ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే ఇప్పుడు మోడిపై వేటు పడటంతో ఆర్‌సీఏ, బీసీసీఐల మధ్య మళ్లీ సత్సంబంధాలు నెలకొంటాయని క్రికెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. మరోవైపు కోటా జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడిగా పని చేస్తున్న అమిన్‌కు రాజస్థాన్ సీఎం వసుంధరా రాజే సింధియా అండదండలు పుష్కలంగా ఉన్నాయి.