
కోహ్లీ ప్రత్యామ్నాయంగా అయ్యర్!
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి, నాలుగో మ్యాచ్ నేపథ్యంలో ముంబై యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది.
న్యూఢిల్లీ:
భారత్-ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న టెస్టు సిరీస్‌లో చివరి, నాలుగో మ్యాచ్ నేపథ్యంలో ముంబై యువ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ నుంచి పిలుపు వచ్చింది. గురువారం భారత జట్టు నెట్ సెషన్‌కు కెప్టెన్ విరాట్ కోహ్లీ వచ్చినా బ్యాటింగ్ ప్రాక్టీస్ మాత్రం చేయలేదు. అతని భుజానికి ఇంకా బ్యాండేజీ కనిపిస్తోంది. కొద్ది సేపు వార్మప్‌లో పాల్గొన్న అనంతరం ఫీల్డింగ్‌లో అండర్ ఆర్మ్ త్రోలు మాత్రం విసిరాడు. మొత్తంగా తన భుజంపై ఎలాంటి ఒత్తిడి పెంచకుండా ఉండేందుకు కోహ్లి ప్రయత్నించాడు. అయితే ముందు జాగ్రత్త కోసమే అతను బ్యాటింగ్‌కు దూరంగా ఉంటున్నట్లు సమచారం. నాలుగో టెస్టుకు ముందు రోజు జరిగే ప్రాక్టీస్ సమయంలో కోహ్లి గాయంపై మరింత స్పష్టత రావచ్చు.
ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి చేతికి గాయమైన విషయం తెలిసిందే. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ లో భాగంగా భారత జట్టు ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద బంతిని ఆపబోయి గాయపడ్డాడు. రవీంద్ర జడేజా వేసిన 39 ఓవర్ తొలి బంతిని ఆస్ట్రేలియా ఆటగాడు హ్యాండ్ స్కాంబ్ బౌండరీకి తరలించే యత్నం చేశాడు. అయితే ఆ బంతిని ఆపే క్రమంలో విరాట్ బౌండరీ లైన్ వద్ద డైవ్ కొట్టాడు. ఇక్కడ విరాట్ ఒక పరుగును సేవ్ చేసినప్పటికీ భుజానికి గాయమైంది. కోహ్లి భుజానికి స్కానింగ్ నిర్వహించి అతని గాయం తీవ్రమైనదేమీ కాదని, మెల్లగా కోలుకుంటున్నాడని బీసీసీఐ ప్రకటించింది. కాగా, సిరీస్‌ను సొంతం చేసుకోవాలంటే ఈ మ్యాచ్ గెలవడం తప్పనిసరి. మూడు మ్యాచ్‌ల తర్వాత ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచిన సంగతి తెలిసిందే. చివరి టెస్టుకు ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియం ఆతిథ్యమిస్తోంది.
కోహ్లి గాయం నేపథ్యంలో బీసీసీఐ ముందు జాగ్రత్తగా శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేసింది. ముంబై ఆటగాడు శ్రేయస్ అయ్యర్ శుక్రవారం జట్టుతో చేరతాడు. ధర్మశాలలాంటి చోటుకు చివరి నిమిషంలో చేరుకోవడం కష్టం కాబట్టి, మరో ఆటగాడు అందుబాటులో ఉంటే మంచిదని భావించి అయ్యర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ ప్రకటించింది. గత ఏడాది రంజీ ట్రోఫీలో 1321 పరుగులతో టాపర్‌గా నిలిచిన అయ్యర్, ఈ సీజన్‌లో కూడా ముంబై తరఫున అత్యధిక పరుగులు సాధించాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టుకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో అయ్యర్ అజేయ డబుల్ సెంచరీ సాధించాడు.