
సాక్షి, హైదరాబాద్: పేసర్ మొహమ్మద్ సిరాజ్‌పై టీమిండియా బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ప్రశంసలు కురిపించారు. సొంతగడ్డపై శుక్రవారం నుంచి వెస్టిండీస్‌తో జరుగనున్న రెండో టెస్టులో అతడిని ఆడించే విషయమై స్పష్టత ఇవ్వకున్నా... ఈ హైదరాబాదీ బౌలర్ ఏ విషయాన్నైనా వెంటనే నేర్చుకునే రకమని కొనియాడారు. ‘గతంలో హైదరాబాద్ రంజీ కోచ్‌గా పనిచేసిన నా అనుభవంతో, భారత్ ‘ఎ’ జట్టు తరఫున ఇటీవలి సిరాజ్ ప్రదర్శన చూసి చెబుతున్నా. అతడు చాలాచాలా త్వరగా నేర్చుకునే క్రికెటర్’ అని భరత్ అరుణ్ అన్నారు. బుధవారం టీమిండియా ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ ఓపెనర్ కేఎల్ రాహుల్ ఆటతీరు, జట్టులో పేసర్ ఉమేశ్ యాదవ్ స్థానంపైనా స్పందించారు.
రాహుల్ గొప్ప ప్రతిభావంతుడని భవిష్యత్‌లో మనకు అద్భుత బ్యాట్స్‌మన్ అవుతాడని పేర్కొన్నారు. సాంకేతిక లోపాలపై కోచ్‌లు రవిశాస్త్రి, సంజయ్ బంగర్‌లు రాహుల్‌తో మాట్లాడుతున్నట్లు తెలిపారు.‘రొటేషన్ విధానం, మిగతా బౌలర్లు రాణిస్తుండటంతోనే ఉమేశ్ యాదవ్‌ను తప్పించాల్సి వస్తోంది. అతడి సామర్థ్యంపై మాకు పూర్తి నమ్మకం ఉంది’ అని వివరించారు. కూర్పులో ప్రయోగాల గురించి పెద్దగా ఆలోచించడం లేదని... అందరికీ అవకాశాలిస్తూ, మంచి బృందాన్ని మైదానంలో దింపడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జట్టులోని 16 మందిలో ఎవరైనా ఆడగలరని అన్నారు. గత మ్యాచ్‌లో పృథ్వీ షాకు అవకాశం ఇచ్చినట్లు ప్రతి టెస్టుకు కొత్త ఆటగాళ్లను దింపగల వనరులు మనకు ఉన్నాయని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment