ఐపీఎల్‌లో లీగ్ మ్యాచ్‌లు క్లైమాక్స్ దశకు వచ్చాయి. ప్రతి ఏడాది లాగే ఈ ఏడాది కూడా చివరి మ్యాచ్ వరకూ ప్లే ఆఫ్ జట్టు ఖరారయ్యేలా కనిపించడం లేదు. ప్రస్తుతానికి సన్‌రైజర్స్ జట్టు ఒక్కటే ప్లే ఆఫ్‌కు అర్హత సాధించినట్లు కనిపిస్తున్నా... వాస్తవానికి ఏ జట్టూ అధికారికంగా ముందంజ వేయలేదు. ప్రస్తుతం నాలుగు బెర్త్‌లకుగాను ఆరు జట్లు రేసులో ఉన్నాయి. పంజాబ్, పుణే జట్లకు ఇప్పటికే ప్లే ఆఫ్ ద్వారం మూసుకుపోయింది. మిగిలిన ఆరు జట్లలో ఎవరి అవకాశాలు ఏమిటి? ప్లే ఆఫ్‌కు వెళ్లాలంటే ఏ జట్టు ఏం చేయాలో చూద్దాం..?
సన్‌రైజర్స్ హైదరాబాద్
ప్రస్తుతం సన్‌రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 16 పాయింట్లతో ప్లేఆఫ్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. అయితే ఇతర సమీకరణాలు, గోల లేకుండా ఉండాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలవాలి. ఒకవేళ సన్ చివరి రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే... కోల్‌కతాపై గుజరాత్ గెలిచి ముంబై చేతిలో ఓడితే... బెంగళూరు, ఢిల్లీల్లో ఒక జట్టు 16 పాయింట్లకు వస్తే... అప్పుడు ఐదు జట్లు 16 పాయింట్లతో సమానంగా ఉంటాయి. రన్‌రేట్ లెక్కలోకి వస్తుంది. అయితే ప్రస్తుతం సన్ రన్‌రేట్ బాగుంది. కాబట్టి చివరి రెండు మ్యాచ్‌ల్లో ఒకవేళ ఓడినా... చిత్తుగా ఓడకుండా రన్‌రేట్‌ను కాపాడుకోవాలి. ఈ సమీకరణం చాలా క్లిష్టం కాబట్టి సన్‌రైజర్స్ ముందుకు వెళ్లినట్లే భావించాలి.
► మిగిలిన మ్యాచ్‌లు: ఢిల్లీ (శుక్రవారం), కోల్‌కతా (ఆదివారం)
కోల్‌కతా నైట్‌రైడర్స్
ప్రస్తుతం 14 పాయిం ట్లతో ఉంది. మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే ఎలాంటి గొడవా లేదు. ఒకవేళ ఒక్క మ్యాచ్ గెలిచినా రన్‌రేట్ బాగుంది కాబట్టి సమస్య రాకపోవచ్చు. మిగిలిన రెండు మ్యాచ్‌లూ ఓడితే 14 పాయింట్లతో ముందుకు వెళ్లడం కష్టం. సన్‌రైజర్స్ అన్నీ గెలిచి, గుజరాత్ కూడా ముంబైపై గెలవాలి. అదే సమయంలో ఢిల్లీ బెంగళూరుపై గెలవాలి. ఈ సమీకరణంలో నాలుగు జట్లు 14 పాయింట్లతో ఉంటాయి. రన్‌రేట్ మెరుగ్గా ఉన్న రెండు జట్లు ముందుకు వెళతాయి. ఈ గొడవలన్నీ లేకుండా కనీసం ఒక మ్యాచ్ గెలిస్తే మేలు.
► మిగిలిన మ్యాచ్‌లు: గుజరాత్ (గురువారం), హైదరాబాద్ (ఆదివారం)
ముంబై ఇండియన్స్
ప్రస్తుతం 14 పాయింట్లు ఉన్నాయి. గుజరాత్‌తో మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. ఒకవేళ గుజరాత్ చేతిలో ఓడితే... అటు ఢిల్లీ బెంగళూరుపై గెలవాలని కోరుకోవాలి. అదే సమయంలో సన్‌రైజర్స్ కూడా అన్ని మ్యాచ్‌లూ గెలవాలని కోరుకోవాలి. ఇలాంటి సందర్భం వచ్చినా నెట్న్‌ర్రేట్ బాగా లేదు కాబట్టి ముందుకు వెళ్లడం కష్టం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ గుజరాత్‌పై గెలిచి, మిగిలిన మ్యాచ్‌ల ఫలితాల కోసం చూడాలి.
► మిగిలిన మ్యాచ్: గుజరాత్ (శనివారం)
గుజరాత్ లయన్స్
కోల్‌కతా, గుజరాత్ పరి స్థితి ఒకేలా ఉంది. కాబట్టి ఈ రోజు జరిగే మ్యాచ్‌లో గెలిచిన జట్టు కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. ఒకవేళ కోల్‌కతాతో ఓడితే ముంబైపై కచ్చితంగా గెలవాలి. ఒకవేళ రెండు మ్యాచ్‌లు ఓడితే మాత్రం 14 పాయింట్లతో ఉన్నా ఏ రకమైన సమీకరణంలో అయినా ముందుకు పోవడం కష్టం కావచ్చు. ఎందుకంటే రేసులో ఉన్న ఆరు జట్లలో అత్యంత దారుణంగా ఈ జట్టు రన్‌రేట్ ఉంది. కాబట్టి వీలైతే రెండు, లేదంటే కనీసం ఒక్కటైనా గెలవాలి.
► మిగిలిన మ్యాచ్‌లు: కోల్‌కతా (గురువారం), ముంబై (శనివారం)
బెంగళూరు రాయల్ చాలెంజర్స్
ప్రస్తుతం 14 పాయింట్లతో ఉంది. లీగ్ ఆఖరి మ్యాచ్ ఢిల్లీతో ఆడాల్సి ఉంది. ఆ సమయానికి మిగిలిన మూడు బెర్త్‌లు దాదాపుగా ఖరారు కావచ్చు. ఒకవేళ ఢిల్లీ జట్టు హైదరాబాద్‌పై గెలిస్తే... ఢిల్లీ, బెంగళూరుల ఆఖరి మ్యాచ్‌లో గెలిచిన జట్టు ముందుకు వెళ్లే పరిస్థితి రావచ్చు. కాబట్టి ఆ మ్యాచ్ గెలవాల్సి ఉంటుంది. ఒకవేళ 14 పాయింట్ల మీద నాలుగు జట్లు ఆగిపోయే పరిస్థితి వస్తే... రన్‌రేట్ అందరికంటే బాగున్నందున ముందుకు వెళుతుంది. మిగిలిన మ్యాచ్: ఢిల్లీ (ఆదివారం)
ఢిల్లీ డేర్‌డెవిల్స్
ప్రస్తుతం 12 పాయింట్లతో ఉంది. కచ్చితంగా మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలిస్తే అవకాశాలు ఉంటాయి. రన్‌రేట్ కూడా బాగోలేదు కాబట్టి... ఒక్క మ్యాచ్ గెలిస్తే సరిపోదు.
మిగిలిన మ్యాచ్‌లు: హైదరాబాద్ (శుక్రవారం), బెంగళూరు (ఆదివారం)
కొసమెరుపు: రేసులో నుంచి ఇప్పటికే వైదొలిగిన పుణే, పంజాబ్ జట్లు ఈ ఆరు జట్ల అవకాశాలను ప్రభావం చేయలేవు. ఎందుకంటే ఈ రెండు జట్లూ తమ ఆఖరి మ్యాచ్‌ను పరస్పరం ఆడాల్సి ఉంది. ఇందులో ఓడిన జట్టు ఆఖరి స్థానంలో నిలుస్తుంది. కాబట్టి ఇది గెలవడం ఈ రెండు జట్లకూ ముఖ్యమే.