సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ
తొలి లీగ్ మ్యాచ్‌లో పరాజయం
సూపర్ సిరీస్ ఫైనల్స్ టోర్నీ
దుబాయ్: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నమెంట్ వరల్డ్ సూపర్ సిరీస్ ఫైనల్స్‌లో భారత స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు తొలి రోజు నిరాశ ఎదురైంది. వీరిద్దరూ తొలి లీగ్ మ్యాచ్‌ల్లో జపాన్ ఆటగాళ్ల చేతిలో పరాజయం పాలయ్యారు. పురుషుల గ్రూప్ ‘బి’ మ్యాచ్‌లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ శ్రీకాంత్ 13-21, 13-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కెంటో మొమొటా (జపాన్) చేతిలో... మహిళల గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్ సైనా 14-21, 6-21తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ నొజోమి ఒకుహారా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు. గురువారం జరిగే రెండో రౌండ్ లీగ్ మ్యాచ్‌ల్లో విక్టర్ అక్సెల్‌సన్ (డెన్మార్క్)తో శ్రీకాంత్, కరోలినా మారిన్ (స్పెయిన్)తో సైనా తలపడతారు.
ఒకుహారాతో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ నెగ్గిన సైనా ఈసారి మాత్రం తేలిపోయింది. చీలమండ గాయంతో బాధపడుతున్న సైనా కోర్టులో చురుకుగా కదల్లేకపోయింది. ఇక మొమొటాతో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీకాంత్ తన సహజశైలి ఆటతీరును కనబర్చలేకపోయాడు.
ఐఓసీ అథ్లెట్స్ కమిషన్ ఎన్నికల్లో సైనా
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)లోని అథ్లెట్స్ కమిషన్ కమిటీ ఎన్నికల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పోటీపడనుంది. వచ్చే ఏడాది ఆగస్టులో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగే ఒలింపిక్స్ సందర్భంగా ఈ ఎన్నికలను నిర్వహిస్తారు. నాలుగు స్థానాల కోసం మొత్తం 24 మంది స్టార్ క్రీడాకారులు పోటీపడనున్నారు.