1981లో ట్రివర్ చాపెల్ అండర్ ఆర్మ్ బౌలింగ్... ట్రివర్ చాపెల్(ఇన్‌సెట్లో)
సాక్షి, స్పోర్ట్స్ : క్రికెట్ ప్రపంచంలో అగ్రశేణి జట్టుగా వెలుగొందుతున్న ఆస్ట్రేలియా పరువు బాల్ ట్యాంపరింగ్ వివాదంతో ఒక్కసారిగా మసకబారింది. సొంత అభిమానులు, దేశ ప్రజల నుంచి ఆసీస్ ఆటగాళ్లు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. కెప్టెన్‌గా స్మిత్ చేసిన పనికి తగిన శిక్ష పడాలంటూ పలువురు అసహనం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో.. ఆసీస్ మాజీ ఆటగాడు ట్రివర్ చాపెల్(గ్రెగ్ చాపెల్ సోదరుడు) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎందుకంటే 1981 వరల్డ్ కప్ సిరీస్‌లో భాగంగా ట్రివర్ చాపెల్ అసాధారణ రీతిలో బౌలింగ్ చేశాడనే ఆరోపణల ఎదుర్కొన్నాడు. దేశ ప్రతిష్టను దిగజార్చాడనే కారణంతో అతడు జీవితంలో చాలా నష్టపోవాల్సి వచ్చింది.
బాల్ ట్యాంపరింగ్ వివాదం గురించి ట్రివర్ చాపెల్ డైలీ టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ.. తప్పు చేశాననే కారణంగా తాను ఎంతో క్షోభ అనుభవించానని చెప్పాడు. 1981 వివాదం గురించి పలు విషయాలు తెలిపాడు. ‘న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన మ్యాచ్‌లో విజయం సాధించాలంటే కివీస్‌కు ఆరు పరుగులు అవసరం. అప్పుడు కివీస్ టెయిలెండర్ బ్రేన్ మెఖేన్ క్రీజులో ఉన్నాడు. ఆ సమయంలో కెప్టెన్‌గా ఉన్న నా సోదరుడు గ్రెగ్ చాపెల్ అండర్‌ఆర్మ్ బౌలింగ్ చేయాల్సిందిగా సూచించాడు. నేను కూడా అది మంచి ఆలోచన అని భావించాను. కానీ అది నా భవిష్యత్తును అంధకారంలో పడేస్తుందని ఊహించలేదంటూ’ చేదు ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నాడు.
నా భార్య వదిలి వెళ్లింది..
‘నేను చేసిన తప్పిదం వల్ల అప్పటి వరకు క్రికెట్‌లో ఆస్ట్రేలియాకు ఉన్న ప్రఖ్యాతి మంటగలిసింది. ఇప్పటికీ చాలామంది దాని గురించి నన్ను అడుగుతూనే ఉన్నారు. ఈ వివాదం కారణంగా నా భార్య నన్ను వదిలి వెళ్లిపోయింది. మళ్లీ నేను పెళ్లి కూడా చేసుకోలేదు. ఎంతో నష్టపోయాను. జీవితం పరిపూర్ణం కావాలంటే కుటుంబం ఉండాలి. కానీ నాకు అవేమీ లేవు. ప్రస్తుతం పిల్లలకు క్రికెట్ కోచ్‌గా ఉంటూ, గోల్ఫ్ ఆడుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాన’ని 37 ఏళ్ల క్రితం నాటి వివాదాన్ని గుర్తుచేసుకున్నాడు 65 ఏళ్ల చాపెల్.
వారిని కూడా జీవితాంతం వెంటాడుతుంది..
‘ఎంతటివారైనా తప్పు చేస్తే శిక్ష అనుభవించక తప్పదు. ఇది నేను స్వయంగా అనుభవించాను. ఇప్పుడు స్మిత్, బెన్‌క్రాఫ్ట్‌లు కూడా అనుభవించక తప్పదు. ఈ వివాదం వారి కెరీర్‌పైనే కాకుండా వ్యక్తిగత జీవితంపై కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. అందుకు వారు సిద్ధంగా ఉండాలి’ అని చాపెల్ సలహా ఇచ్చాడు.
ఇప్పటికైనా నన్ను మర్చిపోతే చాలు..
‘37 ఏళ్లుగా నరకం అనుభవిస్తున్నాను. ఆస్ట్రేలియా క్రికెట్‌ను మసకబార్చిన వారిలో ముఖ్య పాత్రధారి ఎవరంటే ట్రివర్ చాపెల్ అని గూగుల్‌లో కన్పిస్తుంది. కానీ తాజా ఉదంతం వల్ల నా స్థానంలో స్మిత్, బెన్‌క్రాప్ట్‌ల పేరు కన్పిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది’ అంటూ ముగించాడు.
Comments
Please login to add a commentAdd a comment