కెప్టెన్‌గా ఎన్నో విజయాలు అందించా.. కానీ!
లండన్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత తొలిసారిగా అలిస్టెర్ కుక్ ఆసక్తికర విషయాలపై నోరువిప్పాడు. తన నాయకత్వ లక్షణాలపై ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) మేనేజ్‌మెంట్ సందేహాలు వ్యక్తం చేయడంతోనే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. చిరకాల ప్రత్యర్థి ఆస్ట్రేలియాతో ఈ ఏడాది జరగనున్న యాషెస్ సిరీస్‌తో ఘనంగా కెప్టెన్సీకి వీడ్కోలు పలకాలని భావించాడు కుక్. 59 మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన ఈ 32 ఏళ్ల వెటరన్ మాట్లాడుతూ.. '2016లో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్‌ను డ్రా చేసుకోవడంతో నా నాయకత్వంపై సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆపై బంగ్లాదేశ్ చేతిలో తొలిసారిగా ఇంగ్లండ్ జట్టు ఓటమి పాలవడం, ఆ వెంటనే ఐదు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0తో దారుణ మూటకట్టుకోవడం నన్ను అసహనానికి గురిచేశాయి' అని పేర్కొన్నాడు.
'సొంతగడ్డపై 2013, 2015లలో జరిగిన ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌ను అందించాను. ఆపై అదే జోరుతో భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో ఘనవిజయాలు సాధించినా ప్రస్తుతం బోర్డు నాకు తగిన గుర్తింపు ఇవ్వలేదు. గతేడాది పాక్‌తో సిరీస్ డ్రా చేసుకోవడం ఎంతగానో బాధించింది. జట్టు సమష్టిగా వైఫల్యం చెందినా ఫలితం నేను అనుభవించాల్సి వచ్చింది. రెండు యాషెస్ సిరీస్‌లు అందించాను. మరో సిరీస్ వరకు కెప్టెన్ విజయాన్ని అందించాలని భావించాను. ఈసీబీ తనపై నమ్మకం కోల్పోవడంతో కీలక నిర్ణయాన్ని తీసుకున్నాను' అని చెప్పుకొచ్చాడు.
2012 ఆగస్టులో పగ్గాలు చేపట్టిన కుక్ వరుస పరాభవాలతో ఈ ఫిబ్రవరిలో అవమానాల మధ్య కెప్టెన్సీని వదులుకున్నాడు. ఇటీవలి టెస్టు సిరీస్‌లో భారత్ చేతిలో 4-0 తేడాతో ఘోరపరాభవం నేపథ్యంలో ఇంగ్లండ్ జట్టు కెప్టెన్‌గా తాను కొనసాగేది లేనిది త్వరలోనే నిర్ణయం తీసుకుంటానని కుక్ చెన్నైలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్నట్టుగానే కెప్టెన్‌గా కుక్‌కు భారత్ సిరీసే చివరిదిగి నిలిచిపోయింది. 2010-14 మధ్య కాలంలో 69 వన్డేలకు కెప్టెన్‌గా వ్యవహరించాడు కుక్. కుక్ వైదొలిగాక మిడిలార్డర్ ప్లేయర్ జో రూట్ కెప్టెన్ అయ్యాడు. ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.