
డర్బన్: ఇంటాబయట వరుస పరాజయాలతో కుదేలైన శ్రీలంక... దక్షిణాఫ్రికా పర్యటనను మాత్రం ఆశావహంగా ప్రారంభించింది. బుధవారం ఇక్కడ ప్రారంభమైన మొదటి టెస్టులో సఫారీలను తొలి ఇన్నింగ్స్‌లో 235 పరుగులకే ఆలౌట్ చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆతిథ్య జట్టు... లంక పేసర్లు విశ్వ ఫెర్నాండో (4/62), రజిత (3/68) ధాటికి తడబడి 110 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు మార్క్‌రమ్ (11), ఎల్గర్ (0), వెటరన్ హషీమ్ ఆమ్లా (3) తక్కువ స్కోర్లకే వెనుదిరిగారు. బవుమా (47), కెప్టెన్ డు ప్లెసిస్ (35) కాసేపు నిలిచారు.
ఈ దశలో వికెట్ కీపర్ డికాక్ (94 బంతుల్లో 80; 8 ఫోర్లు, 1 సిక్స్), కేశవ్ మహరాజ్ (29) ఆదుకోవడంతో గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన లంక రోజు ముగిసే సమయానికి తిరిమన్నె (0) వికెట్ కోల్పోయి 49 పరుగులు చేసింది. ఓపెనర్, కెప్టెన్ దిముత్ కరుణరత్నే (28 బ్యాటింగ్), ఒషాదా ఫెర్నాండో (17 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.