
న్యూఢిల్లీ: ‘దక్షిణాఫ్రికా పిచ్‌లు అనగానే సహజంగా అందరి దృష్టి పేస్ బౌలింగ్‌పైనే ఉంటుంది. దానికి తగ్గట్లే మా మీద అంచనాలూ ఉంటాయి. ప్రస్తుత మన పేస్ బృందానికి సఫారీలను రెండుసార్లు ఆలౌట్ చేయగల సత్తా ఉంది’ అని భారత సీమర్ ఉమేశ్ యాదవ్ అంటున్నాడు. ‘ఉపఖండంలో మేం రాణించేందుకు మంచి ఫిట్‌నెస్, చక్కటి ప్రణాళిక కీలకంగా నిలిచాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఆశావహ దృక్పథంతో మైదానంలోకి దిగాం. ఇదే తీరును దక్షిణాఫ్రికాలోనూ కనబరిస్తే మమ్మల్ని ఎవరూ ఆపలేరు’ అని పేర్కొన్నాడు.
దిగ్గజ ఆటగాడు కపిల్‌దేవ్‌లా అవుట్ స్వింగర్ తన బలమని.., దానిని కాదని ఇన్‌స్వింగర్లకు ప్రయత్నిస్తే సహజ బలాన్ని కోల్పోతానని వివరించాడు. గత పర్యటనల్లో తామంతా యువకులం కావడంతో పాటు, భారీ అంచనాల ఒత్తిడితో ఇబ్బంది పడినట్లు ఉమేశ్ తెలిపాడు. ఈసారి తనతో సహా షమీ, ఇషాంత్, భువీ, బుమ్రా ఉత్సుకతను అదుపులో ఉంచుకుంటూనే పరిస్థితులను గమనిస్తున్నామని పేర్కొన్నాడు.