పోర్ట్ ఎలిజబెత్: సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో చావుదెబ్బ తిన్న దక్షిణాఫ్రికా వెంటనే కోలుకుంది. నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 6 వికెట్ల తేడాతో ఆసీస్‌ను చిత్తు చేసింది. రెండో ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 22.5 ఓవర్లలో 4 వికెట్లకు 102 పరుగులు చేసి విజయాన్నందుకుంది. డివిలియర్స్ (28), ఆమ్లా (27), మార్క్‌రమ్ (21) చకచకా ఆడి పని పూర్తి చేశారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 180/5తో సోమవారం ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు ఆలౌటైంది. ప్రధాన బ్యాట్స్‌మన్ మిషెల్ మార్‡్ష (45)ను తొలి ఓవర్లోనే రబడ క్లీన్‌బౌల్డ్ చేయడంతో కంగారూల పతనం ప్రారంభమైంది. 37 పరుగుల వ్యవధిలో ఆసీస్ మిగిలిన ఆరు వికెట్లు చేజార్చుకుంది. టిమ్ పైన్ (28 నాటౌట్) కొద్దిగా పోరాడాడు. తొలి ఇన్నింగ్స్‌లాగే మరోసారి చెలరేగిన రబడ 54 పరుగులకే 6 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో 139 పరుగుల ఆధిక్యాన్ని కోల్పోయిన ఆసీస్ దక్షిణాఫ్రికాకు 101 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. ఈ టెస్టులో మొత్తం 11 వికెట్లు తీసిన రబడ ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. మూడో టెస్టు ఈ నెల 22 నుంచి కేప్‌టౌన్‌లో జరుగుతుంది.
రబడ ఖేల్ ఖతం
పేసర్‌పై రెండు టెస్టుల నిషేధం
కేవలం 28 టెస్టుల కెరీర్... నాలుగో సారి మ్యాచ్‌లో పది వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా తరఫున స్టెయిన్, ఎన్తిని తర్వాత ఆ ఘనత సాధించిన బౌలర్ కగిసో రబడ అత్యద్భుత బౌలింగ్ గణాంకాలు ఇవి. పోర్ట్ ఎలిజబెత్‌లో ఆస్ట్రేలియా పని పట్టిన ఈ యువ బౌలర్ తన ఆగ్రహాన్ని మాత్రం అదుపులో ఉంచుకోలేక తనను, తన జట్టును తీవ్రంగా నష్టపరిచాడు. దక్షిణాఫ్రికా భయపడినట్లుగానే రబడపై 2 మ్యాచ్‌ల నిషేధం పడింది. ఈ సిరీస్‌లో 15 వికెట్లతో చెలరేగిన రబడ తాజా ఐసీసీ శిక్షతో ఈ సిరీస్‌లోని తర్వాతి రెండు టెస్టులకు దూరమయ్యాడు. అతనిపై మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా కూడా విధించారు. తొలి ఇన్నింగ్స్‌లో స్మిత్ భుజాన్ని ఉద్దేశపూర్వకంగా ఢీకొన్న ఘటనపై ఆదివారం సాయంత్రమే రిఫరీ ముందు విచారణకు హాజరైన రబడ దానికి కొద్ది సేపు ముందే మరో తప్పు చేశాడు. రెండో ఇన్నింగ్స్‌లో వార్నర్‌ను బౌల్డ్ చేసిన తర్వాత అతని వైపు చూస్తూ తీవ్రంగా అరిచాడు. దీనికి సంబంధించి రబడపై సోమవారం లెవల్–1 ఫిర్యాదు నమోదైంది. స్మిత్ ఘటన లెవల్–2 కాబట్టి 3 డీమెరిట్ పాయింట్ల శిక్ష పడింది. జనవరి 2017 నుంచి వేర్వేరు ఘటనల్లో (డిక్‌వెలా, స్టోక్స్, ధావన్‌లతో గొడవ) ఇప్పటికే ఐదు డీమెరిట్ పాయింట్లు ఈ పేసర్ ఖాతాలో ఉన్నాయి. దాంతో పాయింట్ల సంఖ్య ఎనిమిదికి చేరి రెండు టెస్టుల నిషేధం పడింది. వార్నర్ ఘటనలో కూడా 15 శాతం మ్యాచ్ ఫీజు జరిమానాతో పాటు 1 డీమెరిట్ పాయింట్‌ను ఐసీసీ శిక్షగా విధించింది. దాంతో రబడ మొత్తం పాయింట్ల సంఖ్య 9కి చేరింది.
Comments
Please login to add a commentAdd a comment