ముగ్గురు స్పిన్నర్లతో భారత్‌కు...
దక్షిణాఫ్రికా జట్ల ప్రకటన
జొహన్నెస్‌బర్గ్ : భారత గడ్డపై సుదీర్ఘ పర్యటనకు రానున్న దక్షిణాఫ్రికా జట్టు మూడు ఫార్మాట్‌ల జట్లను ప్రకటించింది. టెస్టుల్లో స్పిన్ పిచ్‌లు ఎదురయ్యే అవకాశం ఉండటంతో తమ జట్టులో కూడా ముగ్గురు స్పిన్నర్లకు అవకాశం కల్పించింది. టెస్టు జట్టులోకి లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్‌తో పాటు ఆఫ్ స్పిన్నర్లు డేన్ పైడ్, సైమన్ హార్మర్‌లను ఎంపిక చేసినట్లు దక్షిణాఫ్రికా సెలక్షన్ కమిటీ కన్వీనర్ లిండా జోండి ప్రకటించారు. ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టు ఆడిన జట్టులో లేని తాహిర్, పైడ్‌లతో డివిలియర్స్ మళ్లీ టీమ్‌లోకి వచ్చాడు. మూడు జట్లలో చూస్తే టి20 సిరీస్‌కు ఎంపికైన బ్యాట్స్‌మన్ ఖాయా జోండో ఒక్కడే పూర్తిగా కొత్త ఆటగాడు.
ఐదుగురు ప్రధాన ఆటగాళ్లు డివిలియర్స్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, తాహిర్‌లు మూడు ఫార్మాట్‌లలోనూ ఉన్నారు. వన్డే, టి20 జట్లలో కూడా ఎలాంటి సంచలనాలు లేకుండా రెగ్యులర్ సభ్యులనే ఎంపిక చేశారు. గాయం కారణంగా టి20 సిరీస్‌కు దూరమైన రోసో... వన్డే సిరీస్ సమయానికి కోలుకునే అవకాశం ఉంది. స్టెయిన్, మోర్నీ మోర్కెల్‌లాంటి ప్రధాన బౌలర్లకు టి20ల్లో విశ్రాంతినిస్తూ మోరిస్, డి లాంజ్‌లకు అవకాశం కల్పించారు. ఈ నెల 29న జరిగే ప్రాక్టీస్ వన్డే మ్యాచ్‌తో ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికా పర్యటన డిసెంబర్ 7న ముగుస్తుంది.
దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: హషీం ఆమ్లా (కెప్టెన్), డివిలియర్స్, డు ప్లెసిస్, డుమిని, ఇమ్రాన్ తాహిర్, బవుమా, ఎల్గర్, హార్మర్, మోర్నీ మోర్కెల్, ఫిలాండర్, పైడ్, రబడ, స్టెయిన్, వాన్‌జిల్, విలాస్.