లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్
న్యూఢిల్లీ: మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరుకాకుండా లండన్లో తలదాచుకుంటున్న ఐపీఎల్ మాజీ కమిషనర్ లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల విన్నపం మేరకు బుధవారం ప్రత్యేక పీఎమ్ఎల్ఏ న్యాయస్థానం వారెంట్ జారీ చేసింది.
ఐపీఎల్ కమిషనర్గా పనిచేసిన కాలంలో మోదీ ఆర్థిక అవకతవకలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ కేసులో ఈడీ మోదీపై కేసు నమోదు చేసింది. కాగా ఐపీఎల్ చైర్మన్ పదవి నుంచి ఉద్వాసనకు గురికావడం, కేసులు నమోదు కావడంతో మోదీ లండన్ పారిపోయారు. 2010 నుంచి మోదీ లండన్లోనే ఉంటున్నారు. విచారణకు హాజరు కావాలని గతంలో ఈడీ సమన్లు పంపినా.. తనకు భారత్లో ప్రాణభయం ఉందంటూ మోదీ రాలేదు. ఈ నేపథ్యంలో ప్రత్యేక కోర్టు వారెంట్ జారీ చేసింది.