లలిత్ మోదీకి షాక్
ముంబై: ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీని యూకే నుంచి భారత్ కు రప్పించడానికి మార్గం సుగమం అయింది. లలిత్ మోదీని భారత్ కు పంపాలని యూకే ప్రభుత్వానికి లేఖ రాయాలని ఈడీ చేసిన అభ్యర్ధనకు కోర్టు అంగీకరించింది. లలిత్ మోదీపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయి ఉన్నా ఆయన యూకేలో ఉండటంతో కేసు విచారణకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే.
ఈ విషయాన్నే కోర్టు లో ప్రస్తావించిన ఈడీ తరఫు న్యాయవాది.. మోదీని వెనక్కు పంపాలని యూకే ప్రభుత్వానికి కోర్టు లేఖ రాయాలని కోరారు. విజయ్ మాల్యా విషయంలో కూడా ఈడీ ఇలాంటి ప్రయత్నమే చేయగా అందుకు చట్టపరంగా అడ్డంకులు ఎదురయ్యాయి. దీంతో కోర్టు ద్వారా యూకే ప్రభుత్వానికి లేఖ పంపేదుకు ఈడీ సిద్ధమవుతోంది.