మునిలా... ధ్యానంలా...
మెరుపు వేగంతో చెలరేగిపోయి చేసిన పరుగులు కావవి... ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి ఊచకోత కోసిన ఇన్నింగ్స్ కాదది... టెస్టుల్లోనూ వేగమే మంత్రంగా కనిపిస్తున్న ఈ రోజుల్లో అత్యంత సంయమనంతో సాగిన అసలైన టెస్టు బ్యాటింగ్ ప్రదర్శన ఇది. కోహ్లి సంచలనాల ముందు, అశ్విన్ అద్భుత ప్రదర్శనల ముందు భారత టెస్టు విజయాల్లో విజయ్ పాత్ర కాస్త కనిపించకుండా పోతోంది గానీ ఓపెనర్‌గా అతను ఇస్తున్న ఆరంభాలు జట్టు జైత్రయాత్రలో కీలకంగా మారాయనేది వాస్తవం. ఈసారి కూడా ఎలాంటి హడావిడి లేకుండా తన ముద్దుపేరు ‘మాంక్’కు తగినట్లుగా ప్రశాంతంగా అతను తన పని తాను చేసుకుంటూ పోయాడు.
ఓపిక, క్రీజ్‌లో పాతుకుపోవాలన్న పట్టుదల, సరైన బంతి కోసం ఎంత సేపయినా వేచి ఉండే తత్వం ఓపెనర్ ప్రాథమిక లక్షణాలు. గురువారం ఆటలో కూడా విజయ్ ఈ క్రమశిక్షణను బాగా పాటించాడు. మొదట్లో పిచ్ పేసర్లకు కాస్త అనుకూలిస్తుండటంతో జాగ్రత్తగా ఆడిన అతను, కుదురుకున్న తర్వాత ఆరు బంతుల వ్యవధిలో మూడు ఫోర్లతో 14 పరుగులు రాబట్టి జోరు పెంచాడు. అతను కొట్టిన 12 బౌండరీలు ఆత్మవిశ్వాసంతో సాధికారికంగా కొట్టినవే. ముఖ్యంగా రబ్బీ ఓవర్‌లో కపిల్‌దేవ్‌ను గుర్తు చేసేలా అతను కొట్టిన నటరాజ స్టయిల్ షాట్ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది.
మురళీ విజయ్ కెరీర్‌లో మొదటి ఐదేళ్లలో ఆడింది 12 టెస్టులే... జట్టుతో పాటు ఉండటం, రెగ్యులర్ ఆటగాళ్ల స్థానంలో అప్పుడప్పుడు ఒక్కో టెస్టు అతనికి దక్కాయి. 2012లో కనీసం ఒక్క టెస్టు కూడా అవకాశం దక్కించుకోలేని విజయ్‌కు అదృష్టవశాత్తూ తొలిసారి పూర్తి స్థాయిలో ఆడే అవకాశం దక్కింది. 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ సిరీస్‌లో అతను తన సత్తాను నిరూపించుకున్నాడు. అందుకు హైదరాబాదే వేదికైంది. ఈ మ్యాచ్‌లో 167 పరుగులు చేసిన విజయ్, తర్వాతి మ్యాచ్‌లోనే మరో సెంచరీ బాది ఓపెనర్‌గా తన స్థానం దాదాపు సుస్థిరం చేసుకున్నాడు. వ్యక్తిగత సమస్యలతో మధ్యలో కొంత ఇబ్బంది పడ్డా... నాటి నుంచి నేటి మరో హైదరాబాద్ సెంచరీ వరకు నాలుగేళ్ల కాలంలో విజయ్ విజయవంతమైన ఓపెనర్‌గా ఎదిగాడు. ముఖ్యంగా గత రెండేళ్ళలో అతని గణాంకాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఆసీస్‌కు ఎదురొడ్డి నిలిచిన 2014–15 సిరీస్‌లో 53, 99, 144, 80 లాంటి స్కోర్లు సాధించడం విజయ్‌కే చెల్లింది. విజయ్ విలువేమిటో ఆ పర్యటన చూపించింది. ఏప్రిల్ 1న పుట్టిన విజయ్, ఒకప్పుడు ఫూల్ అనిపించుకోవడం తనకు ఇష్టం లేదంటూ 17 ఏళ్ల వయసులో తనను తాను వెతుక్కుంటూ ఇల్లు వదిలి వెళ్లాడు. ఢక్కామొక్కీలు తిన్న తర్వాత జీవితంలో లక్ష్యాన్ని నిర్దేశించుకొని అతను ఎదిగిన తీరు, భారత క్రికెట్‌లో అత్యుత్తమ టెస్టు ఓపెనర్లలో ఒకడిగా నిలవడం ఒక సినిమా కథకంటే తక్కువేమీ కాదు.
అప్పుడు అవుటై ఉంటే...
ఇన్నింగ్స్ 19వ ఓవర్లో విజయ్‌ను రనౌట్ చేయడంలో బంగ్లా విఫలమైంది. మెహదీ బౌలింగ్‌లో స్క్వేర్‌లెగ్ దిశగా ఆడిన విజయ్ పరుగు కోసం ప్రయత్నించి మళ్లీ వెనక్కి తగ్గాడు. అప్పటికే పుజారా దాదాపు ఈ వైపు వచ్చేయడంతో విజయ్ ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. చక్కటి ఫీల్డింగ్‌తో బంతిని ఆపిన రబ్బీ దానిని నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లో ఉన్న బౌలర్ మెహదీ వైపు విసిరాడు. అప్పటికే చాలా దూరం ఉన్న విజయ్ తప్పించుకునే అవకాశం కూడా లేదు. కానీ ఒత్తిడిలో బౌలర్ దానిని అందుకోలేకపోయాడు. దాంతో లైఫ్ లభించిన విజయ్ సెంచరీ వరకు దూసుకెళ్లాడు.