పట్టు చిక్కింది! | spectacular show of Indian bowlers | Sakshi
Sakshi News home page

పట్టు చిక్కింది!

Published Fri, Jan 26 2018 12:58 AM | Last Updated on Fri, Jan 26 2018 7:36 AM

spectacular show of Indian bowlers - Sakshi

బంతితో బల ప్రదర్శనలో సై అంటే సై! టపటపా వికెట్లు తీయడంలో మీలాగే మేమూ! పోటాపోటీలో ఆధిక్యం నీదా? నాదా? అన్నట్లు సాగుతోంది వాండరర్స్‌ టెస్టు. ఒకరిద్దరు మినహా రెండు జట్ల ప్రధాన బ్యాట్స్‌మెన్‌ విఫలమైన ఈ పిచ్‌పై బౌలర్లు ‘చేసిన పరుగులే’ అత్యంత విలువైనవిగా మారనున్నాయి. పేస్‌ విశ్వరూపం కనిపిస్తున్నచోట అతి స్వల్పమే అయినా తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలదే పైచేయి అయింది. ప్రస్తుతం 42 పరుగుల ఆధిక్యంలో ఉన్న కోహ్లిసేన రెండో ఇన్నింగ్స్‌లో చూపే పోరాటమే గెలుపు బాట చూపనుంది.

జొహన్నెస్‌బర్గ్‌: పదునైన బంతులతో భారత పేసర్లు ప్రతాపం చూపడంతో మూడో టెస్టులో దక్షిణాఫ్రికా క్లిష్ట పరిస్థితుల్లో పడింది. బుమ్రా (5/54), భువనేశ్వర్‌ (3/44) అరివీర విజృంభణకు తొలి ఇన్నింగ్స్‌లో సఫారీ జట్టు 194 పరుగులకే పరిమితమైంది. బౌలర్‌ వదలడమే ఆలస్యం... బంతి రాకెట్‌లా దూసుకెళ్తున్న వాండరర్స్‌ వికెట్‌పై ఆ జట్టు అతికష్టమ్మీద 7 పరుగుల ఆధిక్యం దక్కించుకుంది. అది కూడా ఆపద్బాంధవుడు ఆమ్లా (121 బంతుల్లో 61; 7 ఫోర్లు) అర్ధ శతకానికి బౌలింగ్‌ ఆల్‌ రౌండర్లు రబడ (84 బంతుల్లో 30; 6 ఫోర్లు), ఫిలాండర్‌ (55 బంతుల్లో 35; 5 ఫోర్లు) తోడుగా నిలవడంతోనే సాధ్యమైంది. వీరు ముగ్గురు తప్ప జట్టులో మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోవడం గమనార్హం. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ ఆట ముగిసేసరికి పార్థివ్‌ పటేల్‌ (16) వికెట్‌ కోల్పోయి 49 పరుగులు చేసింది. ఓపెనర్‌ మురళీ విజయ్‌ (13 బ్యాటింగ్‌), వన్‌డౌన్‌లో వచ్చిన కేఎల్‌ రాహుల్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. ఇప్పటికి టీమిండియా 42 పరుగుల ఆధిక్యంలో ఉంది. బ్యాటింగ్‌ బహు కష్టంగా ఉన్న నేపథ్యంలో నిఖార్సైన పేస్‌ను ఎదుర్కొంటూ నాలుగో ఇన్నింగ్స్‌లో ప్రొటీస్‌కు ఛేదన దుర్లభమే. కాబట్టి... మూడో రోజు భారత్‌ ఎన్ని ఎక్కువ పరుగులు జోడిస్తే విజయానికి అంత చేరువవుతుంది. 

ఆపద్బాంధవుడు నిలిచాడు... 
6/1తో గురువారం ఉదయం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన దక్షిణాఫ్రికా అత్యంత గడ్డు పరిస్థితి ఎదుర్కొంది. భువీ, ఇషాంత్‌ పకడ్బందీ బౌలింగ్‌తో ప్రత్యర్థిని కట్టిపడేశారు. ఏడో ఓవర్లోనే ఎల్గర్‌ (4)ను భువీ అవుట్‌ స్వింగర్‌తో వెనుక్కు పంపాడు. దీంతో నైట్‌వాచ్‌మన్‌ రబడకు ఆమ్లా జత కలిశాడు. వీరిద్దరూ భారత బౌలర్లను పరీక్షించారు. మూడో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ముఖ్యంగా రబడ ఏ ఇబ్బంది లేకుండా ఆడాడు. అయితే... లంచ్‌కు కొద్దిగా ముందు ఇషాంత్‌ బౌలింగ్‌లో గల్లీలో రహానే చురుకైన క్యాచ్‌ పట్టడంతో రబడ పెవిలియన్‌ చేరాడు. దీంతో డివిలియర్స్‌ క్రీజులోకి వచ్చాడు. అంతముందుకు ఇషాంత్‌ బౌలింగ్‌లోనే ఆమ్లా ఎల్బీ అప్పీల్‌ను అంపైర్‌ తిరస్కరించాడు. భారత్‌ డీఆర్‌ఎస్‌ కోరినా... అంపైర్‌ తన నిర్ణయానికే కట్టుబడటంతో వికెట్‌ దక్కలేదు.  

లంచ్‌ తర్వాత బూమ్‌ బూమ్‌ బుమ్రా... 
81/3తో లంచ్‌కు వెళ్లి వచ్చిన దక్షిణాఫ్రికాకు తర్వాత చుక్కలు కనిపించాయి. భువీ, బుమ్రా అద్భుతమైన ఇన్‌స్వింగర్‌లతో డివిలియర్స్‌ (5), కెప్టెన్‌ డుప్లెసిస్‌ (8)లను బౌల్డ్‌ చేశారు. ఈ బంతులకు మేటి బ్యాట్స్‌మెన్‌ అయిన వీరిద్దరి వద్ద సమాధానమే లేకపోయింది. ప్రమాదకారి అయిన డికాక్‌ (8)నూ మరో మంచి బంతితో బుమ్రానే బలిగొన్నాడు. అప్పటికి జట్టు స్కోరు 125/6. దీంతో భారత్‌కు ఆధిక్యం దక్కేలా కనిపించింది. కానీ... ఫిలాండర్‌ తోడుగా ఆమ్లా అడ్డుగోడలా నిలిచాడు. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరు మరో వికెట్‌ పడకుండా టీ విరామానికి వెళ్లారు. అనంతరం ఫిలాండర్‌ దూకుడుగా బౌండరీలు బాదుతూ జట్టు స్కోరును పెంచాడు. ఏడో వికెట్‌కు 44 పరుగులు జోడించాక ఆమ్లా... బుమ్రా బౌలింగ్‌లో షాట్‌ కొట్టబోయి క్యాచ్‌ అవుటయ్యాడు. కొద్దిసేపటికే ఫిలాండర్‌ షమీకి చిక్కాడు. ఫెలుక్‌వాయో (9), మోర్కెల్‌ (9 నాటౌట్‌) రెండేసి బౌండరీలతో సఫారీలకు ఆధిక్యం దక్కించారు. ఇన్నింగ్స్‌ 66వ ఓవర్లో రెండు బంతుల వ్యవధిలో ఫెలుక్‌వాయో, ఇన్‌గిడి (0)లను వెనక్కు పంపిన బుమ్రా ప్రత్యర్థి ఇన్నింగ్స్‌కు ముగింపు పలికి...  కెరీర్‌లో తొలిసారి అయిదు వికెట్ల ఘనత సాధించాడు. లంచ్‌ తర్వాత పడ్డ ఏడు వికెట్లలో బుమ్రాకే ఐదు దక్కాయి.  

పార్థివ్‌ ఓపెనింగ్‌... 
అనంతరం రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన భారత్‌... అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. కీపర్‌ పార్థివ్‌ను ఓపెనింగ్‌కు పంపింది. అయితే మూడు ఫోర్లు కొట్టినా తడబడుతూనే ఆడిన అతడు... మార్క్‌రమ్‌ పట్టిన అద్భుత క్యాచ్‌కు అవుటయ్యాడు. ఈ వికెట్‌ ఫిలాండర్‌కు దక్కింది. తర్వాత వన్‌డౌన్‌లో పుజారా కాకుండా రాహుల్‌ వచ్చాడు. కొన్ని ఉత్కంఠ పరిస్థితులు ఎదుర్కొన్నా... విజయ్, రాహుల్‌ మరో వికెట్‌ పడకుండా రోజును ముగించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మ్యాచ్‌కు కీలకం కానుంది. సఫారీ పేసర్లను కాచుకుంటూ కెప్టెన్‌ కోహ్లి, పుజారా, రహానేలతో పాటు పాండ్యా ఓ చేయి వేసి జట్టు మెరుగైన స్కోరుకు దోహదపడితే ఈ టెస్టులో భారత్‌ విజయాన్ని ఆశించవచ్చు. 

రెండో రోజు 76.5 ఓవర్లే... 
రెండు జట్లలో ఒక్క స్పిన్నరూ లేని పరిస్థితుల్లో వాండరర్స్‌ పిచ్‌పై తొలి రోజు 83 ఓవర్లు పడ్డాయి. రెండో రోజు 76.5 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. విశేషమేమంటే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 77 ఓవర్లకు ఆలౌట్‌ కాగా... సొంతగడ్డపై దక్షిణాఫ్రికా 65.5 ఓవర్లే ఆడగలిగింది. ఇందులో తొలి రోజు ఎదుర్కొన్న 6 ఓవర్లు మినహాయిస్తే గురువారం ఆ జట్టు ఆడినవి 59.5 ఓవర్లే కావడం గమనార్హం. అంతేకాక ఇరు జట్లలోనూ సరిగ్గా ముగ్గురు బ్యాట్స్‌మెనే రెండంకెల స్కోరు చేయగలిగారు. వీరి తర్వాత ఎక్స్‌ట్రాలదే (భారత్‌కు 26), (దక్షిణాఫ్రికాకు 23) అత్యధిక స్కోరు కావడం ఆశ్చర్యకరం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement