
స్పైక్ ఇరుక్కుపోవడం వల్లే...
ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో కీలక దశలో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ రనౌట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
ఫైనల్లో రనౌట్‌పై మిథాలీ వివరణ
ముంబై: ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్లో కీలక దశలో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ రనౌట్ కావడం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. ఆ తర్వాత అనుభవలేమితో జట్టు కుప్పకూలింది. మిథాలీ క్రీజ్‌లో ఉండి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో! ఆ పరుగు తీసే ప్రయత్నంలో మిథాలీ నెమ్మదిగా స్పందించిన తీరు, డైవ్ చేసే ప్రయత్నం కూడా చేయకుండా ముందే ఆగిపోవడం విమర్శలకు కారణమైంది. దీనిపై మిథాలీ వివరణ ఇచ్చింది. ‘నా రనౌట్ గురించి సోషల్ మీడియాలో చాలా మంది తమ ఇష్టమొచ్చినట్లు రాశారు. నిజానికి పూనమ్ రౌత్ పిలుపునకు నేను సరిగ్గానే స్పందించాను.
అయితే సగం దూరం వెళ్లే లోపే నా షూ స్పైక్ పిచ్‌లో ఇరుక్కుపోయింది. నేను డైవ్ చేసే అవకాశం కూడా లేకపోయింది. నిస్సహాయంగా ఆగిపోవడం తప్ప నేనేమీ చేయలేకపోయాను. ఈ విషయాన్ని టీవీ కెమెరాలు గుర్తించలేకపోయాయి’ అని భారత కెప్టెన్ చెప్పింది. వరల్డ్ కప్ ముగిసిన అనంతరం బుధవారం తెల్ల వారుజామున భారత్‌కు చేరుకున్న జట్టుకు భారీ ఎత్తున ఘనస్వాగతం లభించింది. ప్రస్తుతం దక్కుతున్న గౌరవాన్ని పొందేందుకు తమ జట్టు సభ్యులందరికీ అర్హత ఉందని మిథాలీ తెలిపింది.