టీ20 వరల్డ్‌కప్ 2024 ఫైనల్లో ఇవాళ (జూన్ 29) భారత్, సౌతాఫ్రికా జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. బార్బడోస్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి టైటిల్ సాధించాలని ఇరు జట్లు పట్టుదలగా ఉన్నాయి. ఇందు కోసం ఇప్పటికే వ్యూహప్రతివ్యూహాలు సిద్దం చేసుకున్నాయి. వరల్డ్‌కప్ గెలవడం ఓ జట్టుకు (టీమిండియా) 13 ఏళ్ల నిరీక్షణ అయితే.. మరో జట్టుకు (సౌతాఫ్రికా) చిరకాల కోరిక.
ప్రపంచ కప్‌లో తొలిసారి ఇలా..
ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్, సౌతాఫ్రికా అజేయ జట్లుగా ఫైనల్‌కు చేరాయి. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇలా (ఫైనల్‌కు చేరిన జట్లు అజేయ జట్లుగా నిలవడం) జరగడం ఇదే తొలిసారి.
ఈ మెగా సమరానికి ముందు పొట్టి ఫార్మాట్‌లో ఇరు జట్లు ఎన్ని సార్లు ఎదురెదురుపడ్డాయో ఓ లుక్కేద్దాం. ఈ ఫార్మాట్‌లో భారత్-సౌతాఫ్రికా పోరాటం 18 ఏళ్ల కిందట మొదలైంది. జోహనెస్‌బర్గ్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ప్రొటీస్‌ను ఖంగుతినిపించింది. ఆ మ్యాచ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆడిన ఏకైక అంతర్జాతీయ టీ20 మ్యాచ్.
టీమిండియాదే ఆధిక్యం
అప్పటి నుంచి పొట్టి క్రికెట్‌లో భారత్-సౌతాఫ్రికా జట్లు 26 మ్యాచ్‌ల్లో ఎదురెదురుపడగా.. టీమిండియా 14, సౌతాఫ్రికా 11 మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
టీ20 ప్రపంచకప్‌లో ఇరు జట్ల హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. సౌతాఫ్రికాపై భారత్‌కు స్పష్టమైన ఆధిక్యత ఉంది. ఇరు జట్లు ఆరు సందర్భాల్లో ఎదురెదురుపడగా.. భారత్ 4, సౌతాఫ్రికా 2 మ్యాచ్‌ల్లో గెలుపొందాయి. ఇరు జట్ల మధ్య చివరిసారి జరిగిన వరల్డ్‌కప్ (2022 ఎడిషన్) మ్యాచ్‌లో భారత్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment