T20 World Cup 2024 Final: ద్రవిడ్‌కు చివరి మ్యాచ్‌.. టైటిల్‌తో వీడ్కోలు పలకండి..! | T20 World Cup 2024 Final, IND vs SA: Rahul Dravid Last Match As Team India Head Coach | Sakshi
Sakshi News home page

T20 World Cup 2024 Final: ద్రవిడ్‌కు చివరి మ్యాచ్‌.. టైటిల్‌తో వీడ్కోలు పలకండి..!

Published Sat, Jun 29 2024 7:39 AM | Last Updated on Sat, Jun 29 2024 9:21 AM

T20 World Cup 2024 Final, IND vs SA: Rahul Dravid Last Match As Team India Head Coach

టీ20 వరల్డ్‌కప్‌ 2024 చివరి అంకానికి చేరింది. బార్బడోస్‌ వేదికగా భారత్‌-సౌతాఫ్రికా మధ్య ఇవాళ (జూన్‌ 29) జరుగబోయే ఫైనల్‌తో మెగా టోర్నీ ముగస్తుంది. ఈ మ్యాచ్‌ టీమిండియా హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌కు చివరిది. భారత హెడ్‌ కోచ్‌గా ద్రవిడ్‌ పదవీకాలం ఈ మ్యాచ్‌తో ముగస్తుంది. టైటిల్‌ గెలిచి ద్రవిడ్‌కు ఘనంగా వీడ్కోలు పలకాలని టీమిండియా ఆటగాళ్లు భావిస్తున్నారు. భారత క్రికెట్‌ అభిమానులు సైతం ఇదే కోరుకుంటున్నారు. 

కోచ్‌గా ద్రవిడ్‌ టీమిండియాకు ఎనలేని సేవలనందించాడు. ద్రవిడ్‌ ఆథ్వర్యంలో టీమిండియా వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌, వన్డే ‍ప్రపంచకప్‌ ఫైనల్‌ లాంటి ప్రతిష్టాత్మకమైన మ్యాచ్‌లు ఆడింది. ఇప్పుడు టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌ ఆడనుంది. తన హయాంలో భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన ద్రవిడ్‌కు ఒక్క ఐసీసీ టైటిల్‌ గెలవలేదన్న లోటు మిగిలిపోయింది. ఈ ప్రపంచకప్‌తో ఆ లోటు తీర్చుకోవాలని ద్రవిడ్‌ పట్టుదలగా ఉన్నాడు. 

ఇందుకోసం అతను బాయ్స్‌ను (టీమిండియా క్రికెటర్లను) సమాయత్తం చేస్తున్నాడు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దైనా (రిజర్వ్‌ డేలో కూడా) భారత్‌ సంయుక్త విజేతగా నిలుస్తుంది కానీ.. అది ద్రవిడ్‌కు అంత సంతృప్తిని ఇవ్వకపోవచ్చు. భారత ఆటగాళ్లకు, అభిమానులకు కూడా సంయుక్త విజేతలుగా నిలవడం ఇష్టం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మ్యాచ్‌ జరిగి. అందులో టీమిండియా విజేతగా నిలవాలని యావత్‌ భారత దేశం కోరుకుంటుంది. 

భారత్‌ చివరిసారి ప్రపంచకప్‌ టైటిల్‌ను (వన్డే) 2011లో సాధించింది. టీ20 వరల్డ్‌కప్‌ను 2007 అరంగేట్రం ఎడిషన్‌లో గెలిచింది. ఈ సారి టీమిండియా టైటిల్‌ సాధిస్తే.. ప్రపంచకప్‌ కోసం​ 13 ఏళ్ల నిరీక్షణకు తెరపడినట్లవుతుంది.

మరోవైపు ఈ వరల్డ్‌కప్‌లో మరో ఫైనలిస్ట్‌ అయిన సౌతాఫ్రికా కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టైటిల్‌ గెలవాలని పట్టుదలగా ఉంది. రాకరాక వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సౌతాఫ్రికా ఇప్పటివరకు ఒక్క వరల్డ్‌కప్‌ టైటిల్‌ కూడా గెలవలేదు. ఫైనల్స్‌కు చేరడం కూడా ఆ జట్టుకు ఇదే మొదటిసారి. కాబట్టి సౌతాఫ్రికా కూడా టైటిల్‌ సాధించే విషయంలో కృత నిశ్చయంతో ఉంది. మరి ఎవరు టైటిల్‌ గెలుస్తారో వేచి చూడాలి.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement