
టార్గెట్...10
ఆశల పల్లకిలో భారత బృందం
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి భారత్ నుంచి ఏకంగా 121 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌కు వెళుతున్నారు. మరి ఇందులో ఎంతమంది పతకాలు తెస్తారు..? ఇది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఒలింపిక్స్ లాంటి మెగా ఈవెంట్‌లో ఆ క్షణంలో ఒత్తిడిని జయించిన వాళ్లనే పతకాలు వరిస్తాయి. నాలుగేళ్ల క్రితం లండన్‌లో భారత క్రీడాకారులు ఆరు పతకాలు గెలిచారు. ఈసారి రియో ఒలింపిక్స్‌లో 10 పతకాలు గెలవడం భారత్ లక్ష్యం. గత నాలుగేళ్లలో వివిధ క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో మన ప్రదర్శన చూస్తే పది పతకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ పది మంది ఎవరు..?
స్వాతంత్య్రం వచ్చాక భారత్ 17 సార్లు ఒలింపిక్స్ క్రీడల్లో బరిలోకి దిగింది. ఈ 17 పర్యాయాల్లో కేవలం మూడుసార్లు మాత్రమే ఒకే ఒలింపిక్స్‌లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పతకాలు వచ్చాయి. తొలిసారి 1952 హెల్సింకి ఒలింపిక్స్‌లో భారత్‌కు రెండు పతకాలు లభించాయి. భారత పురుషుల హాకీ జట్టు స్వర్ణం సాధించగా... పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో ఖాషాబా జాదవ్ కాంస్య పతకాన్ని గెలుపొందారు. ఆ తర్వాత 13 ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారులు ఒక పతకంతో తొమ్మిదిసార్లు, ఎలాంటి పతకమే లేకుండా నాలుగుసార్లు స్వదేశానికి తిరిగి వచ్చారు.
2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత ఆటగాళ్లు తమ అత్యుత్తమ ప్రదర్శనను నమోదు చేశారు. ఒక స్వర్ణం, రెండు కాంస్యాలు సాధించి ఒకేసారి మూడు పతకాలు గెలిచారు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో గత రికార్డును బద్దలు కొడుతూ ఏకంగా ఆరు పతకాలతో భారత క్రీడాకారులు మెరిశారు. లండన్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి అత్యధికంగా 83 మంది బరిలోకి దిగగా... ఈసారి రియో ఒలింపిక్స్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా 121 మంది పతకాల వేటలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ‘రియో’లో పతకాలతో భారత పతాకాన్ని రెపరెపలాడించే ఆశాకిరణాలెవరో పరిశీలిద్దాం..! - సాక్షి క్రీడావిభాగం
సైనా మళ్లీ సాధించాలి
గత ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన భారత స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ఈసారి కూడా పతకం సాధించే అవకాశాలు ఉన్నాయి. ఒలింపిక్స్‌కు ముందు చివరి మెగా టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్‌ను గెలవడంతో సైనా ఆత్మవిశ్వాసంతో ఉంది. తొలిసారిగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన సింధు కూడా తనదైన రోజున ఎవరినైనా ఓడించగలదు. ఈ ఇద్దరిలో ఒక్కరైనా పతకం తెస్తారనే ఆశ ఉంది. అయితే ఈసారి పోటీ కూడా బాగా తీవ్రంగా ఉంది. లీ జురుయ్, యిహాన్ వాంగ్ (చైనా)లతోపాటు కరోలినా మారిన్ (స్పెయిన్) రేసులో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో శ్రీకాంత్‌కు కాస్త అదృష్టం కూడా తోడైతే పతకం ఆశించొచ్చు.
బాణం రాణించాలి
ప్రపంచ నంబర్‌వన్ హోదాలో లండన్ ఒలింపిక్స్‌లో బరిలోకి దిగి పతకంపై ఆశలు రెకేత్తించిన ఆర్చర్ దీపిక కుమారి తీవ్రంగా నిరాశపరిచింది. అయితే గత వైఫల్యాల అనుభవంతో ఈసారి రియోలో ఈ జార్ఖండ్ ఆర్చర్ మరింత మెరుగైన ప్రదర్శన చేస్తే పతకం వచ్చే అవకాశముంది. ఇటీవల కాలంలో దీపిక కుమారి, బొంబేలా దేవి, లక్ష్మీరాణిలతో కూడిన భారత మహిళల ఆర్చరీ జట్టు నిలకడగా రాణిస్తోంది. అదే ప్రదర్శనను రియోలోనూ పునరావృతం చేస్తే ఆర్చరీలో మనకు కనీసం ఒక పతకం వస్తుందనే నమ్మకముంది.
‘పంచ్’ పవర్
రెజ్లింగ్, షూటింగ్ తర్వాత వ్యక్తిగత క్రీడాంశంలో వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం అందించడంలో భారత బాక్సర్లు సఫలమయ్యారు. 2008లో విజేందర్ సింగ్, 2012లో మేరీకోమ్ కాంస్య పతకాలు నెగ్గారు. లండన్‌తో (8 మంది) పోలిస్తే ఈసారి కేవలం ముగ్గురు (శివ థాపా, మనోజ్ కుమార్, వికాస్ క్రిషన్ యాదవ్) మాత్రమే భారత్ నుంచి అర్హత పొందారు. ఈ ముగ్గురికీ ఇవి రెండో ఒలింపిక్స్. గతంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో, ఆసియా క్రీడల్లో, ఆసియా చాంపియన్‌షిప్‌లో, యూత్ ఒలింపిక్స్‌లో పతకాలు నెగ్గిన వికాస్ క్రిషన్ (75 కేజీలు) ... ఆరేళ్ల క్రితం యూత్ ఒలింపిక్స్‌లో రజతం, గతేడాది ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన శివ థాపా (56 కేజీలు)ల నుంచి పతకాలు ఆశించవచ్చు.
‘గురి’ కుదురుతుంది
అంతర్జాతీయస్థాయిలో నిలకడగా పతకాలు తెచ్చే భారత షూటర్లు ఒలింపిక్స్‌లోనూ ఆపద్భాంధవులుగా వ్యవహరిస్తున్నారు. గత మూడు ఒలింపిక్స్‌లో నాలుగు పతకాలు నెగ్గిన షూటర్లు ఈసారి తమ గురికి మరింత పదును పెట్టి ఆ సంఖ్యను రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్ కానున్న అభినవ్ బింద్రా (10 మీటర్ల ఎయిర్ రైఫిల్), లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్‌లపై భారీ అంచనాలే ఉన్నాయి. కొంతకాలంగా అద్భుతమైన ఫామ్‌లో ఉన్న పిస్టల్ షూటర్స్ జీతూ రాయ్... హీనా సిద్ధూ.. ఎయిర్ రైఫిల్‌లో అపూర్వీ చండీలా, ట్రాప్‌లో అనుభవజ్ఞుడైన మానవ్‌జిత్ సంధూ పతకాలపై ఆశలు రేకెత్తిస్తున్నారు. ఈసారి షూటింగ్ నుంచి కనీసం మూడు పతకాలు ఆశించవచ్చు.
పట్టు సడలించకూడదు
బీజింగ్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ కాంస్యం నెగ్గిన తర్వాత భారత్‌లో రెజ్లింగ్ రూపురేఖలే మారిపోయాయి. ఈ ప్రాచీన క్రీడకు ఒక్కసారిగా ఆదరణ పెరిగింది. అందరి అంచనాలను నిజం చేస్తూ లండన్ ఒలింపిక్స్‌లో సుశీల్ కుమార్ రజతం, యోగేశ్వర్ దత్ కాంస్యం సాధించారు. దాంతో రియోలోనూ అందరి దృష్టి భారత రెజ్లర్లపై పడింది. అనుభవజ్ఞుడైన యోగేశ్వర్ దత్ (65 కేజీలు) తనస్థాయికి తగ్గట్టు ప్రదర్శన కనబరిస్తే కచ్చితంగా ఈసారీ మరో పతకంతో తిరిగొస్తాడు. ట్రయల్స్ నిర్వహించాలని స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్ అభ్యర్థించినా... అతని మాటను లెక్క చేయకుండా ఒలింపిక్ బెర్త్ దక్కించుకున్న నర్సింగ్ యాదవ్‌నే (74 కేజీలు) రియోకు పంపిస్తుండటంతో అతను కూడా పతకం తెచ్చి అందరికీ సమాధానం చెప్పాలనే పట్టుదలతో ఉన్నాడు. ‘రెప్‌చేజ్’ నిబంధన కారణంగా పతకం నెగ్గేందుకు రెండు అవకాశాలు ఉండటం రెజ్లర్లకు అనుకూలించే అంశం. మహిళల విభాగంలో వినేశ్ ఫోగట్ (48 కేజీలు), బబితా కుమారి (53 కేజీలు) సంచలనం సృష్టించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
సమన్వయం కుదిరితే...
భారత టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్, రోహన్ బోపన్న, సానియా మీర్జాల వద్ద కావాల్సినంత అనుభవం, ప్రతిభ ఉన్నా... మ్యాచ్‌ల సమయంలో సరైన సమన్వయం లేకుండా ఆడితే మాత్రం ఈసారీ టెన్నిస్‌లో పతకాన్ని ఆశించలేము. పురుషుల డబుల్స్‌లో పేస్‌తో పట్టుబట్టి మరీ బోపన్నను ఆడిస్తుండటంతో ఫలితం ఎలా ఉంటుందో చెప్పలేం. మిక్స్‌డ్ డబుల్స్‌లో 16 జోడీలు మాత్రమే ఉండటంతో రోహన్ బోపన్న-సానియా మీర్జా జంటకు అనుకూలమైన ‘డ్రా’ ఎదురై... మూడు విజయాలు దక్కితే పతకం ఖాయం.
ఆ ఒక్క విన్యాసంతో...
ఐదు దశాబ్దాల తర్వాత దీపా కర్మాకర్ రూపంలో భారత జిమ్నాస్ట్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఆమె ప్రధాన ఈవెంట్ అయిన వాల్టింగ్ హార్స్‌లో ‘ప్రోడునోవా’ విన్యాసం అత్యంత క్లిష్టతరమైనది. ఈ విన్యాసాన్ని పరిపూర్ణంగా చేసేవారు అరుదు. 22 ఏళ్ల ఈ త్రిపుర జిమ్నాస్ట్ రియోలో గనుక ‘ప్రోడునోవా’ విన్యాసాన్ని పర్‌ఫెక్ట్‌గా చేస్తే కనీసం కాంస్యం నెగ్గే అవకాశముంది.
అద్భుతం జరిగితే...
ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీలో రజతం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు ఒక్కసారిగా ఒలింపిక్స్‌పై ఆశలు పెంచింది. గ్రూప్ ‘బి’లో జర్మనీ, నెదర్లాండ్స్, అర్జెంటీనా, కెనడా, ఐర్లాండ్ జట్లతో ఉన్న భారత్ క్వార్టర్ ఫైనల్ చేరుకోవచ్చు. క్వార్టర్ ఫైనల్లో విజయం సాధిస్తే మాత్రం భారత్ పతకం రేసులో నిలిచినట్టే. అథ్లెటిక్స్‌లో 36 మంది బరిలో దిగుతున్నా... పతకం వస్తే అది అద్వితీయ ఫలితమేనని అనుకోవాలి. గోల్ఫ్, జూడో, రోయింగ్, వెయిట్‌లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, స్విమ్మింగ్‌లలో పతకాలు ఆశించలేం.