బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా): ప్రతిష్టాత్మక ఒలింపిక్స్ పోటీలకు ముందు వర్ధమాన అథ్లెట్లు తమ సత్తా చాటేందుకు అవకాశం కల్పిస్తున్న యూత్ ఒలింపిక్స్‌కు రంగం సిద్ధమైంది. నేటి నుంచి అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్‌లో మూడో యూత్ ఒలింపిక్స్ పోటీలు జరగనున్నాయి. 2010లో తొలిసారి జరిగిన పోటీలకు సిం గపూర్, 2014లో చైనాలోని నాన్‌జింగ్ ఆతిథ్యమిచ్చాయి. నేటి నుంచి ఈ నెల 18 వరకు 2018 పోటీలు జరుగుతాయి. మొత్తం 32 క్రీడాంశాల్లో 4000 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. ఒలింపిక్ చరిత్రలో తొలి సారి ‘లింగ సమానత్వం’ అనే నేపథ్యాన్ని ఈ క్రీడల్లో చేర్చారు. దీని ప్రకారం పోటీల్లో పాల్గొనే ఆటగాళ్లలో పురుషులు, మహిళల సంఖ్య సరిగ్గా సమానంగా ఉంటుంది. తాజా నిర్ణయంతో కొత్త తరహా ఒలింపిక్ స్ఫూర్తికి శ్రీకారం చుట్టినట్లవుతుం దని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్ బాచ్ అన్నారు. ‘ఇక్కడ మొదలు పెట్టే కొత్త మార్పులు ఒక్క యూత్ గేమ్స్‌కే పరిమితం కావు. అందరి కోసం ఆటలు అనే విధంగా మొత్తం ఒలింపిక్ ఉద్యమం గొప్పతనం చాటేలా నిర్ణయాలు తీసుకుంటాం’ అని ఆయన అన్నారు. బ్యూనస్ ఎయిర్స్ క్రీడలతోనే అనేక కొత్త అంశాలు ఈ పోటీల్లో ప్రవేశ పెడుతున్నారు. బ్రేక్‌డ్యాన్సింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, రోలర్ స్పోర్ట్స్ అండ్ కరాటే, బీఎం ఎక్స్ ఫ్రీస్టయిల్, కైట్ బోర్డింగ్, బీచ్ హ్యాండ్‌బాల్, ఫుట్సల్, అక్రోబటిక్ జిమ్నాస్టిక్స్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయి.
47 మందితో భారత్: భారత్ తరఫున యూత్ ఒలింపిక్స్‌లో 13 క్రీడాంశాల్లో కలిపి మొత్తం 47 మంది ఆటగాళ్లు పాల్గొంటున్నారు. భారత్ మొదటిసారి ఫీల్డ్ హాకీ ఫైవ్స్, స్పోర్ట్ క్లైంబిం గ్‌లో పాల్గొంటోంది. షూటర్ మను భాకర్ ప్రారంభ వేడుకల్లో పతాకధారి కాగా... బ్యాడ్మింటన్‌లో సంచలన ఆటగాడు లక్ష్య సేన్‌తోపాటు తెలుగమ్మాయి జక్కా వైష్ణవి రెడ్డి కూడా పోటీ పడుతోంది. 2010 యూత్ ఒలింపిక్స్‌లో భారత్ ఆరు రజతాలు, రెండు కాంస్యాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు గెలిచి 58వ స్థానంలో నిలిచింది. 2014 యూత్ ఒలింపిక్స్‌లో ఒక రజతం, ఒక కాంస్యం నెగ్గి రెండు పతకాలతో 64వ స్థానంలో నిలిచింది. అయితే ఈసారి షూటర్లు మను భాకర్, సౌరభ్ చౌదరి, మెహులీ ఘోష్ అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో భారత్ ఈసారి పసిడి బోణీ చేసే అవకాశాలున్నాయి. బాక్సింగ్‌లో జ్యోతి గులియా (51 కేజీలు), టేబుల్ టెన్నిస్‌లో మానవ్ ఠక్కర్, బ్యాడ్మింటన్‌లో లక్ష్య సేన్, రెజ్లింగ్‌లో మాన్సి పతకాలు గెలిచే అవకాశముంది.
ఆటల్లోనూ సగం... సమం...
Published Sat, Oct 6 2018 1:10 AM | Last Updated on Sat, Oct 6 2018 1:10 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment