గోపీ అకాడమీలు అద్భుతం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని పుల్లెల గోపీచంద్ అకాడమీలు అద్భుతమని కేంద్ర క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్ కితాబిచ్చారు. శనివారం ఆయన గోపీచంద్‌కు చెందిన రెండు బ్యాడ్మింటన్ అకాడమీలను సందర్శించారు. అక్కడి కోర్టులు, ఆటగాళ్లకు ఏర్పాటు చేసిన సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన బ్యాడ్మింటన్ నేర్చుకునేందుకు ఈ అకాడమీలు చక్కని వేదికలన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అకాడమీలను తీర్చిదిద్దిన గోపీచంద్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. ఇలాంటి అకాడమీలు మరిన్ని ఉంటే భారత క్రీడల ముఖచిత్రమే మారుతుందని అభినందించారు.
‘20 మంది గోపీలాంటివారుంటే మరెంతో మంది సింధులొస్తారు. దేశ క్రీడారంగం అభివృద్ధికి ఈ అకాడమీలు ఎంతగానో దోహదం చేస్తాయి’ అని మంత్రి గోయెల్ అన్నారు. అకాడమీలను సమర్థంగా నిర్వహిస్తున్న గోపీచంద్ భార్య లక్ష్మి, తల్లి సుబ్బరావమ్మలను ఆయన అభినందించారు. అనంతరం తెలంగాణ స్పోర్ట్స్ జర్నలిస్టుల సంఘం (టీఎస్‌జేఏ) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న విజయ్ గోయెల్... గోపీచంద్‌ను ఘనంగా సన్మానించారు. తర్వాత టీఎస్‌జేఏ ప్రతినిధులు రాజీవ్ ఖేల్ రత్నా అవార్డీ పి.వి.సింధు, ద్రోణాచార్య అవార్డీ నాగపురి రమేశ్‌లను సత్కరించారు.