క్రికెటర్ పెరీరాకు నష్ట పరిహారం!
కొలంబో: శ్రీలంక క్రికెటర్ కుశాల్ పెరీరా నిషేధిత పదార్థాలు తీసుకున్నాడని వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(వాడా) తప్పుడు నివేదిక ఇవ్వడంతో అందుకు ప్రతిఫలంగా నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆ దేశ క్రికెట్ బోర్డు అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)ని ఆశ్రయించింది. దీనికి సంబంధించిన నివేదికను ఇప్పటికే ఐసీసీకి అందజేసినట్లు శ్రీలంక చైర్మన్ తిలంగా సుమతిపాలా స్పష్టం చేశారు. ఈ మేరకు కుశాల్ పై వచ్చిన ఆరోపణల కారణంగా అతను ఖర్చుపెట్టిన మొత్తాన్ని చెల్లించాల్సిందిగా వాడాను ఐసీసీ కోరినట్లు సుమతి పాలా తెలిపారు. కుశాల్ విషయంలో తప్పు జరగడంపై వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ పరిహారం చెల్లించడానికి అంగీకారం తెలిపిందన్నారు. కాగా, ఆ పరిహారం అందిన వెంటనే కుశాల్ కు అందజేయనున్నట్లు తెలిపారు.
డోపింగ్ చేశాడన్న ఆరోపణలతో నిషేధానికి గురైన పెరీరాకు గత రెండు నెలల క్రితం ఊరట లభించిన సంగతి తెలిసిందే. గతేడాది డిసెంబర్ లో న్యూజీలాండ్ తో పర్యటనకు వెళ్లిన కుశాల్, గత జూలైలో చేసిన డోపింగ్ పరీక్షల్లో ఫెయిలయ్యాడన్న కారణంగా స్వదేశానికి పంపించారు. యూఏఈలో పాకిస్తాన్ తో టెస్ట్ సిరీస్ సందర్భంగా నిషేధిత పదార్థాలను తీసుకున్నాడని వాడా నిర్వహించిన టెస్టుల్లో తేలడంతో అతడిపై నాలుగేళ్ల నిషేధం పడింది. అయితే ఖతార్ కు చెందిన ల్యాబొరేటరీలో చేసిన డోపింగ్ టెస్టుల్లో నెగటివ్ రావడంతో కుశాల్ పై విధించిన నాలుగేళ్ల నిషేధాన్ని ఐసీసీ ఎత్తివేసింది.