మిర్పూర్: ట్వంటీ 20 ప్రపంచకప్ లో భాగంగా తుది పోరులో టీమిండియాతో తలపడుతున్న శ్రీలంక టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత షేర్ బంగ్లా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకిగా మారాడు. దీంతో మ్యాచ్ నలభై నిమిషాల ఆలస్యంగా ఆరంభం కానుంది. అవుట్ ఫీల్డ్ తడిగా మారడంతో మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది.2011 వన్డే ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన ధోనిసేన... ఈసారి టి20 ప్రపంచకప్ నెగ్గి మూడు టైటిళ్లను ఏకకాలంలో సంపాదించుకున్న తొలి జట్టుగా అవతరించాలని ఉవ్విళ్లూరుతోంది.
సూపర్-10 దశలో రెండు గ్రూప్‌లలో విజేతలుగా నిలిచిన జట్లే ఫైనల్‌కు చేరడం ఈ జట్లు టోర్నీలో ఇప్పటి వరకూ చూపించిన నిలకడకు నిదర్శనం. అవడానికి ప్రపంచకప్ అయినా రెండు ఆసియా జట్ల మధ్య ఆదివారం జరిగే ఈ టి20 సమరానికి షేరే బంగ్లా స్టేడియం వేదిక కానుంది. భారత్, శ్రీలంకల మధ్య ఇదే వేదికలో టోర్నీకి ముందు జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో శ్రీలంక గెలిచింది. అయితే ఆ మ్యాచ్‌ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఇరు జట్లూ అంటున్నాయి.