
కోల్‌కతా: ముంబై ఇండియన్స్‌తో సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఘోర ఓటమి చెందడం పట్ల ఆ జట్టు సహ యజమాని షారుఖ్ ఖాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ మేరకు కేకేఆర్ ఓటమి పాలు కావడం పట్ల అభిమానులు క్షమించాలని షారుఖ్ విన్నవించాడు. ‘ఆటలో ఎప్పుడూ చూడాల్సింది టీమ్ స్పిరిట్. ఇక్కడ గెలుపు-ఓటములు సహజం. దీన్ని అభిమానులు అర్థం చేసుకోవాలి. ముంబై ఇండియన్స్‌పై కేకేఆర్ సమష్టిగా పోరాడటంలో విఫలమైంది. అందుకు అభిమానులకు క్షమాపణలు తెలియజేస్తున్నా’ అని షారుఖ్ ట్వీటర్‌లో పేర్కొన్నాడు. బుధవారం ఈడెన్ గార్డెన్‌లో ముంబైతో జరిగిన మ్యాచ్‌లో కేకేఆర్ కుదేలైంది. ముంబై విసిరిన 211 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కేకేఆర్ 108 పరుగులకే కుప్పకూలి భారీ ఓటమిని కొనితెచ్చుకుంది. అదే సమయంలో ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది.