
ముంబై: స్టార్ ఇండియా 2018–19 సీజన్‌కు ఐపీఎల్‌తో పాటు బీసీసీఐ దేశవాళీ సీజన్ ఆడియో, వీడియో ప్రొడక్షన్ హక్కులను సొంతం చేసుకుంది. స్టార్ ఇప్పటివరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మీడియా హక్కులు కలిగి ఉంది. ‘మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారానికి సంబంధించి బీసీసీఐ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ ఆహ్వానించింది. ఐపీఎల్ 2018, 2018–19 సీజన్ ప్రొడక్షన్ హక్కులు స్టార్ ఇండియాకు దక్కాయి’ అని బోర్డు కార్యదర్శి అమితాబ్ చౌదరీ వెల్లడించారు.
ఇదే ఒప్పందాన్ని యథాతథంగా మరో ఏడాది పొడిగించేందుకు, 2020 ఐపీఎల్‌కు ప్రత్యేకంగా కొనసాగించే విచక్షణాధికారం బీసీసీఐకి ఉందని అమితాబ్ తెలిపారు. అయితే... ఒప్పందం మొత్తం ఎంతనే వివరాలు మాత్రం బయటకు రాలేదు. ఐపీఎల్ ఐదేళ్ల కాలానికి టీవీ, డిజిటల్, గ్లోబల్ ప్రసార హక్కులను గతేడాది స్టార్ ఇండియా రూ.16 వేల 347 కోట్లకు దక్కించుకుంది.