ఐపీఎల్ సందడి ముగిసింది. కొద్దిపాటి విశ్రాంతి కూడా పూర్తయింది. ఇక కొత్త సీజన్ కోసం భారత జట్టు సిద్ధమైంది. ఒక టెస్టు, మూడు వన్డేలు ఆడేందుకు ఢాకా వెళ్లింది. మామూలుగా అయితే ఈ పర్యటన గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదు.
కానీ ఈ సీజన్‌లో భారత్‌కు చాలా ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉంది. ముఖ్యంగా టెస్టుల్లో భారత్ ఆటతీరు మెరుగవుతుందా? కెప్టెన్‌గా కోహ్లి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి?
సాక్షి క్రీడావిభాగం
ఇక నుంచి నేర్చుకోవడానికి కాదు... గెలవడానికి ఆడాలి... బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరే ముందు టెస్టు కెప్టెన్ కోహ్లి వ్యాఖ్య ఇది. సారథిగా తన దృక్పథం ఎలా ఉండబోతోందో ఈ ప్రకటనతోనే చెప్పేశాడు. గత ఏడాది ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్ సమయంలోనే కోహ్లి తన దూకుడును చూపించాడు. చాలామంది కెప్టెన్లు డ్రా కోసం ఆడే పరిస్థితులున్న మ్యాచ్‌లో విజయం కోసం ప్రయత్నించి ఓడిపోయాడు. ‘ఓ మ్యాచ్‌లో గెలవడానికి ప్రయత్నించి ఓడిపోయినా నేను బాధపడను’ అనే కోహ్లి మాట భవిష్యత్‌లోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తాడనడానికి సూచన. వన్డేలు, టి20ల సంగతి ఎలా ఉన్నా టెస్టుల్లో భారత్ క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది. దీనిని మార్చాలనే పట్టుదలతో కొత్త సీజన్‌కు కోహ్లిసేన సిద్ధమవుతోంది.
బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టు సీజన్‌కు వార్మప్ లాంటిది మాత్రమే. ఈ ఏడాది దక్షిణాఫ్రికాతో సిరీస్ ఉంది. అందులో మన జట్టు సత్తా ఏంటో బయటకు వస్తుంది. అయితే ప్రస్తుతం జట్టు ఆత్మవిశ్వాసంతోనే ఉంది. అనుభవం పెద్దగా లేకపోయినా నైపుణ్యానికి కొదవలేని క్రికెటర్లతో కొత్త సీజన్‌ను ప్రారంభిస్తున్నారు. అయితే కొత్త కెప్టెన్ దూకుడు దృక్పథాన్ని ఏమేరకు ఆటగాళ్లు అందిపుచ్చుకుంటారో చూడాలి.
యువ జట్టు
హర్భజన్, మురళీ విజయ్ మినహా ప్రస్తుత టెస్టు జట్టులో అందరూ 30 ఏళ్ల లోపు వాళ్లే. గాయంతో ఈ టెస్టుకు దూరమైన ఓపెనర్ లోకేశ్ రాహుల్ వయసు 23 ఏళ్లే. కాబట్టి ఓపెనర్ స్థానానికి భవిష్యత్‌లో సమ స్య లేదు. పుజారా, రహానే, రోహిత్ 28 ఏళ్ల లోపు వారే. స్పిన్నర్ అశ్విన్‌కు 28 ఏళ్లే. విదేశాల్లో సిరీస్‌లు గెలవాలంటే పేస్ బౌలర్లు కీలకం. భా రత పేస్ బృందం ఉమేశ్, ఇషాం త్, భువనేశ్వర్, ఆరోన్ అందరూ 28 ఏళ్ల లోపు వారే. వీరిలో ఇషాంత్‌కు ఇప్పటికే చాలా అనుభవం ఉంది. తక్కువ వయసు క్రికెటర్లు జట్టులో ఉండటం భవిష్యత్‌లో మేలు చేసే అంశం.
ప్రణాళికల్లో మార్పు
కెప్టెన్‌గా ధోని రికార్డు అద్భుతం. గతంలో ఎవరికీ సాధ్యంకాని విజయాలు చాలా సాధించాడు. కానీ టెస్టుల్లో ధోని కెప్టెన్సీ వ్యూహాలపై చాలా విమర్శలు ఉన్నాయి. రక్షణాత్మక ధోరణితో ఆడిస్తాడనే ముద్ర ఉంది. దీనిని మార్చడం కోహ్లి ప్రథమ లక్ష్యం. ప్రస్తుతం కోహ్లి వయసు 26 సంవత్సరాలు. నిస్సందేహంగా తనే జట్టులో ఉత్తమ బ్యాట్స్‌మన్. కాబట్టి తనకు కెప్టెన్‌గానూ భవిష్యత్ చాలా ఉంటుంది. కావలసినంత సమయం ఉంది కాబట్టి... తొలుత తనకు ఏం కావాలనేది స్పష్టంగా తెలుసుకోవాలి. ఏదో ఒక్క సిరీస్‌కో పరిమితం కాకుండా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
ఓడితే ఏడో ర్యాంక్‌కు
ప్రస్తుతం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భారత్ మూడో స్థానంలో ఉంది. బంగ్లాతో జరిగే ఏకైక టెస్టులో గెలిస్తేనే ఈ ర్యాంక్‌ను నిలబెట్టుకోవచ్చు. ఒకవేళ ఓడిపోతే ఏకంగా ఏడో ర్యాంక్‌కు పడిపోతుంది. ఒకవేళ డ్రా అయినా నాలుగో ర్యాంక్‌కు కోహ్లిసేన పడిపోతుంది.
రాగానే ప్రాక్టీస్...
మిర్పూర్: బంగ్లా గడ్డపై అడుగు పెట్టగానే భారత జట్టు సాధనపై దృష్టి పెట్టింది. సోమవారం ఉదయం ఢాకా చేరుకున్న టీమిండియా ఆటగాళ్లు మధ్యాహ్నం దాదాపు రెండు గంటలకు పైగా ప్రాక్టీస్ చేశారు. ఏకైక టెస్టు జరగనున్న ఫతుల్లాలో బంగ్లాదేశ్ టీమ్ ప్రాక్టీస్ కొనసాగుతున్నందున ఢాకాలోని షేర్ ఎ బంగ్లా స్టేడియంలో కోహ్లి బృందం సాధన చేసింది. ‘జట్టులోని 14 మంది సభ్యులు పూర్తి ఫిట్‌గా ఉన్నారు. కోల్‌కతాలో ప్రాక్టీస్ సందర్భంగా గాయపడిన సాహా కూడా పూర్తిగా కోలుకున్నాడు. అతను కూడా జట్టుతో పాటు సాధన చేశాడు. మంగళవారం ఫతుల్లాలో శిక్షణ కొనసాగుతుంది’ అని టీమ్ మేనేజర్ బిశ్వరూప్ డే తెలిపారు.
► భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య ఇప్పటివరకూ నాలుగు టెస్టు సిరీస్‌లు జరిగాయి. అన్నీ భారత్ గెలిచింది. సిరీస్‌లన్నీ బంగ్లాదేశ్‌లోనే జరిగాయి.
► మొత్తం రెండు జట్ల మధ్య ఇప్పటివరకూ జరిగిన ఏడు టెస్టుల్లో ఆరు భారత్ గెలిచింది. ఒక మ్యాచ్ డ్రాగా ముగిసింది.
కొత్త ఇన్నింగ్స్ మొదలు
Published Tue, Jun 9 2015 4:16 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM
Advertisement
Advertisement