పరుగుల వేటలో పోటాపోటీ!
సిడ్నీ: పరుగుల వేటలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా ప్రస్తుత కెప్టెన్ స్టీవెన్ స్మిత్ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ వీరిద్దరూ పోటాపోటీగా సెంచరీలు బాదుతున్నారు. రికార్డులు లిఖిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆటలో వీరిద్దరూ నాలుగేసి సెంచరీలు సాధించారు. నాలుగు టెస్టుల్లోనూ నాలుగు శతకాలు బాది స్మిత్ అరుదైన రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. కోహ్లి రెండో టెస్టులో మినహా మిగతా మ్యాచుల్లో సెంచరీలు నమోదు చేశాడు.
అడిలైడ్ లో జరిగిన తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో స్మిత్ 162, కోహ్లి 115 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లోనూ కోహ్లి(141) శతకం సాధించాడు. ఈ మ్యాచ్ లో టీమిండియాకు కోహ్లి నాయకత్వం వహించాడు. బ్రిస్బేన్ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో స్మిత్(133) చేయగా, కోహ్లి నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టుకు ధోని కెప్టెన్ గా వ్యవహరించాడు. ఆసీస్ కు స్మిత్ నేతృత్వం వహించాడు. మెల్ బోర్న్ టెస్టులో మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో స్మిత్ 192, కోహ్లి 169 పరుగులు చేశారు. రెండో ఇన్నింగ్స్ లో వీరిద్దరూ రాణించలేదు.
ఇక చివరిదైన సిడ్నీ టెస్టులోనూ వీరిద్దరూ సెంచరీలు సాధించడం విశేషం. తొలి ఇన్నింగ్స్ లో స్మిత్ 117 పరుగులు చేయగా, కోహ్లి 140 పరుగులతో ఆట కొనసాగిస్తున్నాడు. ఈ మ్యాచ్ లో తమ జట్లకు వీరిద్దరూ కెప్టెన్లుగా వ్యవహరిస్తున్నారు. మరో రెండు రోజులు ఆట మిగులుండడంతో ఈ యువ కెప్టెన్లు మరిన్ని పరుగులు పిండుకునే అవకాశముంది.