
ఖాజా జట్టులో లేకపోవడంపై స్మిత్ విచారం
ఆక్లాండ్: న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ కు ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖాజాను ఎంపిక చేయకపోవడంపై కెప్టెన్ స్టీవ్ స్మిత్ విచారం వ్యక్తం చేశాడు. న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కు ముందు ఆరోన్ ఫించ్ గాయం కారణంగా దూరం కావడంతో ఖాజాకు పిలుపు అందినా తొలి మ్యాచ్ లో అతని చోటు దక్కకపోవడం తనను విస్మయానికి గురి చేసిందన్నాడు. ఖాజా ఒక మంచి ఆటగాడిగా ఇప్పటికే నిరూపించుకున్నాడని స్మిత్ కొనియాడాడు.
ఇది కేవలం పొరపాటు వల్ల జరిగింది మాత్రమేనని సంజాయిషీ ఇచ్చుకునే యత్నం చేశాడు. మిగతా రెండు వన్డేలలో అతనికి కనీసం ఒక మ్యాచ్లోనైనా అవకాశం ఇస్తామని స్మిత్ భరోసా ఇచ్చాడు. అతను బంతిని హిట్ చేసే విధానం చాలా ముచ్చటగా ఉంటుందని ఈ సందర్భంగా స్మిత్ పేర్కొన్నాడు. అద్భుతంగా రాణిస్తున్న ఆస్ట్రేలియా జట్టులో ఆటగాళ్ల ఎంపిక చాలా క్లిష్టతరంగా మారిందని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పాడు. ఇటీవల కాలంలో న్యూజిలాండ్, విండీస్ జట్లతో ఆడిన నాలుగు టెస్టుల్లో ఖాజా మూడు సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో పాటు బిగ్ బాష్ లీగ్ లో రెండు సెంచరీలు చేసి సిడ్నీ థండర్ తొలిసారి విజేతగా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.