
లండన్: ‘ది సన్’ వార్తాపత్రికపై ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎప్పుడో 31 ఏళ్ల క్రితం తమ కుటుంబంలో జరిగిన ఓ విషాద ఘటనను తిరిగి గుర్తుచేస్తూ వార్తా కథనాన్ని ప్రచురించడం పట్ల అతడు అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాజాగా ముగిసిన యాషెస్ సిరీస్‌లో స్టోక్స్ తన ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకున్నాడు. ఈ క్రమంలో ‘ది సన్’ పత్రిక ‘స్టోక్స్ సీక్రెట్ ట్రాజెడీ’ అనే కథనాన్ని ప్రచురించింది. స్టోక్స్ పుట్టడానికి మూడేళ్ల ముందు అతడి కుటుంబంలో విషాదకర ఘటన జరిగింది. (స్టోక్స్ సోదరి, సోదరుడు అతి కిరాతకంగా హత్యకు గురవుతారు. స్టోక్స్ తల్లి మాజీ స్నేహితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు). ఇదే వార్తను మూడు దశాబ్దాల తర్వాత తిరిగి హైలెట్ చేస్తూ ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.
దీంతో ‘ది సన్’వార్తా పత్రికపై స్టోక్స్ అసహనం వ్యక్తం చేశాడు. ‘ఈ రోజు సన్ పత్రికలో వచ్చిన వార్తను చూసి నేను చాలా బాధపడ్డా. నా వ్యక్తిగత, బాధకరమైన విషయాన్ని బహిర్గతం చేశారు. ఎప్పుడో 31 ఏళ్ల క్రితం జరిగిన ఘటనను మళ్లీ తెరపైకి తీసుకొచ్చి మమ్మల్ని ఆవేదనకు గురిచేశారు. జర్నలిజం విలువలను ఏ మాత్రం పట్టించుకోకుండా ‘ది సన్’ వ్యవహరించింది. మూడు రోజుల క్రితం రిపోర్టర్లు మా ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులతో ఈ విషయం గురించి గుచ్చిగుచ్చి అడిగి బాధ కలిగించారు. మా కుటుంబానికి చెందిన విషాదకర విషయాన్ని అప్పటి నుంచి మా గుండెల్లోనే దాచుకుని కుమిలికుమిలి బాధపడుతున్నాం. ఇప్పుడు బయటి ప్రపంచానికి ఈ విషయాన్ని తెలిపి ‘ది సన్’ ఏదో సాధించింది అని ఆనందం పడుతోంది. మీ కుటంబానికి చెందిన సున్నితమైన, వ్యక్తిగత విషయాన్ని ఫ్రంట్ పేజీలో పబ్లిష్ చేయగలరా?’ అంటూ స్టోక్స్ మండిపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment