
భారత్ తో సిరీస్.. అతడు చాలా కీలకం!
ఇంగ్లండ్ తమ జట్టు ఆటగాడు బెన్ స్టోక్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది.
ఇంగ్లండ్ తమ జట్టు ఆటగాడు బెన్ స్టోక్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. తాజాగా ఆ జట్టు మాజీ కెప్టెన్ మైఖెల్ వాన్ మాటల్ని బట్టి చూస్తే ఇది అర్థమవుతోంది. ఇంగ్లండ్-భారత్ మధ్య జరగనున్న 5 టెస్టుల సిరీస్ లో స్టోక్స్ తమ జట్టులో కీలక ఆటగాడని వాన్ అభిప్రాయపడ్డాడు. అలిస్టర్ కుక్ నేతృత్వంలోని ఇంగ్లండ్ ఇటీవల బంగ్లాదేశ్ తో జరిగిన రెండో టెస్టులో ఓటమి పాలై సిరీస్ ను 1-1తో సమయం చేసుకున్న విషయం తెలిసిందే. స్టోక్స్ లేకపోతే తొలి టెస్టులోనూ ఇంగ్లండ్ ఓటమిపాలయ్యేదని మాజీ ప్లేయర్ వాన్ పేర్కొన్నాడు.
తొలి టెస్టు చిట్టగాంగ్ లో ఓవరాల్ గా స్టోక్స్ 103 పరుగులు చేశాడు. అయితే బంగ్లాపై కేవలం 22పరుగులతో మాత్రమే నెగ్గింది. ఆ టెస్టు రెండో ఇన్నింగ్స్ లో స్టోక్స్ 85 పరుగులతో ఇంగ్లండ్ ను ఆదుకున్నాడని మాజీ కెప్టెన్ వాన్ ప్రశంసించాడు. ప్రధాన స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. స్టోక్స్ 11 వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్ లోనూ రాణించాడని కొనియాడాడు. పాకిస్తాన్ తో సిరీస్ లో గాయంతో అతడు జట్టుకు దూరం కావడంతో ఆ సిరీస్ ఇంగ్లండ్ నెగ్గలేకపోయిందన్నాడు.