స్టోయినిస్‌ సూపర్‌ సెంచరీ వృథా | Stoyinis Super Century wasted | Sakshi
Sakshi News home page

స్టోయినిస్‌ సూపర్‌ సెంచరీ వృథా

Published Tue, Jan 31 2017 12:28 AM | Last Updated on Tue, Sep 5 2017 2:29 AM

స్టోయినిస్‌ సూపర్‌ సెంచరీ వృథా

స్టోయినిస్‌ సూపర్‌ సెంచరీ వృథా

11 సిక్సర్లతో చెలరేగిన ఆల్‌రౌండర్‌
6 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా ఓటమి
న్యూజిలాండ్‌తో తొలి వన్డే  


ఆక్లాండ్‌: 287 పరుగుల లక్ష్యం... 67 పరుగులకే ఆరు వికెట్లు ఫట్‌.. ఈ దశలో ఆస్ట్రేలియా కనీసం 150 పరుగులు సాధిస్తే గొప్పేనని మ్యాచ్‌ చూసినవారికి అనిపించింది. అయితే కెరీర్‌లో రెండో వన్డే ఆడుతున్న ఆల్‌రౌండర్‌ స్టోయినిస్‌ (117 బంతుల్లో 146 నాటౌట్‌) మాత్రం తన అసమాన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్‌ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించాడు. 11 సిక్సర్లు, 9 ఫోర్లతో అతను ఎదురుదాడికి దిగడంతో కివీస్‌ వెన్నులో వణుకు పుట్టింది. అయితే 47వ ఓవర్‌లో ఆసీస్‌కు దురదృష్టం వెంటాడింది. సౌతీ వేసిన ఆ  ఓవర్‌లో నాలుగు, ఐదో బంతులను స్టోయినిస్‌ సిక్సర్లుగా మలిచాడు. దీంతో ఆసీస్‌ విజయ సమీకరణం 19 బంతుల్లో 7 పరుగులకు వచ్చింది. దీంతో కెప్టెన్‌ విలియమ్సన్‌ ఫీల్డింగ్‌ సెటప్‌ కోసం కాస్త సమయం తీసుకున్నాడు. షార్ట్‌ మిడాన్‌లో తనే ఫీల్డింగ్‌కు దిగాడు. ఆఖరి బ్యాట్స్‌మన్‌ హాజెల్‌వుడ్‌ నాన్‌స్ట్రయిక్‌ ఎండ్‌లో ఉన్నాడు. చివరి బంతికి సౌతీ వేసిన యార్కర్‌ను స్టోయినిస్‌ మామూలుగానే ఆడగా బంతి విలియమ్సన్‌ వైపు వెళ్లింది.

అయితే అప్పటికే హాజెల్‌వుడ్‌ లేని పరుగు కోసం క్రీజు వదిలి రెండు అడుగులు ముందుకు వచ్చాడు. దీంతో పక్కనే ఉన్న విలియమ్సన్‌ మెరుపు వేగంతో స్పందించి రనౌట్‌ చేయడంతో ఆసీస్‌ ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ఉత్కంఠభరిత క్షణాల మధ్య ఆరు పరుగులతో విజయం సాధించిన కివీస్‌ సంబరాల్లో మునిగింది. చాపెల్‌–హ్యాడ్లీ ట్రోఫీలో 1–0తో ఆధిక్యం సాధించింది.

మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన ఈ తొలి మ్యాచ్‌లో ముందుగా కివీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 286 పరుగులు చేసింది. బ్రూమ్‌ (73; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), గప్టిల్‌ (61; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. అనంతరం ఆసీస్‌ 47 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. 54 పరుగులకు ఐదు వికెట్లు పడిన దశలో క్రీజులోకొచ్చిన స్టొయినిస్‌ వరుసగా వికెట్లు పడుతున్నా ఒంటరి పోరాటంతో కివీస్‌ను వణికించాడు. ఫాల్క్‌నర్‌ (25; 1 ఫోర్‌)తో కలిసి ఏడో వికెట్‌కు 81 పరుగులు.. చివరి వికెట్‌కు హాజెల్‌వుడ్‌తో కలిసి 50 పరుగులు జోడించాడు. ఈ భాగస్వామ్యంలో హాజెల్‌వుడ్‌ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేదంటే స్టోయినిస్‌ విశ్వరూపం అర్థమవుతుంది. సాన్‌ట్నర్‌కు మూడు... బౌల్ట్, ఫెర్గూసన్‌కు రెండేసి వికెట్లు దక్కాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement