
‘అర్జున’కు సిక్కి, సుమీత్ పేర్లు ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు కోసం ఈసారి బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ క్రీడా పురస్కారం ‘అర్జున’ అవార్డు కోసం ఈసారి బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారులు సిక్కి రెడ్డి, సుమీత్ రెడ్డి పేర్లను భారత బ్యాడ్మింటన్ సంఘం (బాయ్) ప్రతిపాదించింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టులో రెగ్యులర్ సభ్యులుగా మారిన వీరిద్దరిని ‘అర్జున’ కోసం నామినేట్ చేసినట్లు ‘బాయ్’ అధికారి ఒకరు తెలిపారు. కాగా వీరిద్దరూ త్వరలో వివాహబంధంతో ఒకటి కానున్నారు.
ఫిబ్రవరిలో సుమీత్, సిక్కిల నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది జరిగిన సయ్యద్ మోడీ గ్రాండ్‌ప్రి గోల్డ్ అంతర్జాతీయ టోర్నీలో ప్రణవ్ చోప్రాతో మిక్స్‌డ్ డబుల్స్‌లో టైటిల్‌ను గెలిచిన సిక్కిరెడ్డి... అశ్విని పొన్నప్పతో కలిసి మహిళల డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ కూడా అశ్విని పొన్నప్పతో కలిసి సయ్యద్ మోడీ టోర్నీలో రన్నరప్‌గా నిలిచాడు. గతేడాది కెనడా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్‌లో మను అత్రి–సుమీత్ రెడ్డి ద్వయం విజేతగా నిలిచింది.