
న్యూఢిల్లీ: సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ అందరి దృష్టి ఫిఫా ప్రపంచకప్‌పై ఉంది. ప్రపంచకప్‌లో ఏ ఏ జట్లు రాణిస్తాయోనని అంచనాలకు దిగుతున్నారు. ఈ క్రమంలో భారత్ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ చెత్రి కూడా తన అభిప్రాయాలు పంచుకున్నాడు. ఈ ప్రపంచకప్‌లో జర్మనీ, స్పెయిన్, బ్రెజిల్, ఫ్రాన్స్ జట్లు అత్యంత బలగా ఉన్నాయన్నాడు. కానీ ఈ జట్లతో పాటు ఇంగ్లండ్ జట్టును డార్క్ హర్స్‌గా చెత్రీ అభివర్ణించాడు. ఇంగ్లండ్ జట్టుపై ఎలాంటి ఒత్తిడి లేదని, కాబట్టి ఆ జట్టు తన సహజమైన ఆటతీరును ప్రదర్శించే అవకాశం ఉందని చెత్రీ తెలిపాడు.
ఇదిలా ఉంచితే, అర్జెంటీన స్టార్ ఆటగాడు మెస్సీ గోల్స్ రికార్డును సమం చేయడంపై చెత్రీ సంతోషం వ్యక్తం చేశాడు. ‘నేను మెస్సీ అభిమానిని. అతన్ని గోల్స్ ను సమం చేయడం ఒక ఆటగాడిగా నాకు చాలా ఆనందంగా ఉంది. కాకపోతే అతనితో నన్ను పోల్చడం సరికాదు. మెస్సీ ఒక దిగ్గజ ఆటగాడు’ అని చెత్రీ తెలిపాడు.