'సచిన్ ఎప్పుడూ అలా ఆడలేదు'
న్యూఢిల్లీ:భారత క్రికెట్ లో సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్ లు ఇద్దరూ దిగ్గజాలే. వారి ఆట తీరుతో భారత్ క్రికెట్ ను ఉన్నతస్థాయిలో నిలబెట్టారనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఆ మేటి ఆటగాళ్లను పోలిస్తే మాత్రం కచ్చితంగా సునీల్ గవాస్కరే బెస్ట్ అంటున్నాడు పాకిస్థాన్ మాజీ లెజెండ్, పాకిస్థాన్ తెహ్రిక్-ఏ- ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షడు ఇమ్రాన్ ఖాన్. గవాస్కర్ ఆడే సమయంలో నలుగురు దిగ్గజ వెస్టిండీస్ బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొవడమే అతన్ని ఉన్నతస్థితిలో నిలిపిందన్నాడు. తాను చూసిన ప్రపంచ ఆటగాళ్లలో గవాస్కరే అత్యున్నత బ్యాట్స్ మెన్ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించాడు.
'ఎజెండా ఆజ్ తక్' కార్యక్రమంలో గవాస్కర్-సచిన్ లలో ఎవరు గొప్ప అని అడిగిన ప్రశ్నకు ఇమ్రాన్ ఇలా స్పందించాడు. 'సచిన్ సాధించిన ఘనతలను తక్కువగా చూపలేం. క్రికెట్ ఆటలో సచిన్ ప్రస్థానం వెలకట్టలేనిది. కాకపోతే విండీస్ దిగ్గజ బౌలర్లను గవాస్కర్ అటాక్ చేసే తీరు నిజంగా ముచ్చటగా ఉండేది. గవాస్కర్ ఆడే సమయంలో ఇండియాలో సరైన పేస్ బౌలర్లు లేరు. పెద్దగా పేస్ బౌలింగ్ లో ప్రాక్టీస్ లేకుండానే ఫీల్డ్ లోకి దిగే గవాస్కర్ హేమాహేమీ బౌలర్లను అలవోకగా ఆడేవాడు. గవాస్కర్ తరహా ఇన్నింగ్స్ ను సచిన్ ఒక్కటి కూడా ఆడలేదనేది నా అభిప్రాయం' అని ఇమ్రాన్ తెలిపాడు. దీంతో పాటు పాకిస్థాన్ మాజీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ ను కూడా ఇమ్రాన్ పొగడ్తలతో ముంచెత్తాడు. ఆ కాలంలో షేన్ వార్న్, అనిల్ కుంబ్లే తరహా బౌలర్ ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా ఖాదిరేనని స్పష్టం చేశాడు. భారత ప్రధాని నరేంద్రమోదీతో ఇమ్రాన్ ఖాన్ శుక్రవారం ఢిల్లీలో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ భేటీ సందర్భంగా ఇమ్రాన్ ఖాన్ మోదీని పాకిస్థాన్ పర్యటనకు ఆహ్వనించారు.