మిస్టీరియస్ స్పిన్నర్ పై మళ్లీ ఫిర్యాదు
న్యూఢిల్లీ: ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆడుతున్న వెస్టిండీస్ మిస్టీరియస్ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ యాక్షన్ పై మరోసారి ఫిర్యాదు అందింది. అతడు బౌలింగ్ చేసే తీరు సందేహాస్పదంగా ఉందంటూ ఆన్-ఫీల్డ్ అంపైర్లు అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం విశాఖపట్టణంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో నరైన్ బౌలింగ్ యాక్షన్ నియమ నిబంధలనకు విరుద్ధంగా ఉందని ఆన్-ఫీల్డ్ అంపైర్లు రిచర్డ్ ఇల్లింగ్టన్, వినీత్ కులర్ణి రిపోర్ట్ చేశారని బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ థాకూర్ ఒక ప్రకటనలో తెలిపారు.
దీంతో మరోసారి అతడు పరీక్ష ఎదుర్కొబోతున్నాడు. సందేహాస్పద బౌలింగ్ ఆరోపణలతో ఐపీఎల్-8 ప్రారంభానికి ముందు చెన్నై బయోమెకానికల్ సెంటర్ లో నరైన్ బౌలింగ్ పరీక్ష ఎదుర్కొన్నాడు. దీని ఫలితం వెలువడిన తర్వాతే ఐపీఎల్-8లో ఆడేందుకు బీసీసీఐ అతడికి అనుమతి ఇచ్చింది. మరోసారి నరైన్ బౌలింగ్ యాక్షన్ పై అనుమానాలు వ్యక్తం కావడంతో కోల్ కతా నైట్ రైడర్స్ కు కంగారు పట్టుకుంది.