ఐపీఎల్ నవాబ్స్ | Sunrisers a cut above RCB, lift IPL 2016 trophy | Sakshi
Sakshi News home page

ఐపీఎల్ నవాబ్స్

Published Mon, May 30 2016 1:43 AM | Last Updated on Mon, Sep 4 2017 1:12 AM

ఐపీఎల్ నవాబ్స్

ఐపీఎల్ నవాబ్స్

హమారా హైదరాబాద్ ఐపీఎల్ చాంపియన్ బన్‌గయా... సన్‌రైజర్స్ అద్భుతాన్ని చేసి చూపించింది. టోర్నీ ఆద్యంతం నిలకడను ప్రదర్శించిన ఆరెంజ్ ఆర్మీ ఆఖరి పోరులో కూడా సత్తా చాటింది. గేల్, కోహ్లిల తుఫాన్ బ్యాటింగ్‌కు అసమాన బౌలింగ్‌తో ఎదురొడ్డి విజయబావుటా ఎగరేసింది. ఆదినుంచి నమ్ముకున్న బౌలర్లు మరోసారి నమ్మకాన్ని నిలబెట్టడంతో లీగ్‌లో తొలి సారి విజేతల జాబితాలో సగర్వంగా తమ పేరును లిఖించుకుంది. జట్టులో సూపర్ స్టార్లు లేకపోయినా... కీలక సమయంలో ప్రతీ ఒక్కరూ చెలరేగడంతో ఐపీఎల్-9కు సన్‌రైజర్స్ అద్భుత ముగింపునిచ్చింది.


 సీజన్ ఆరంభం నుంచి జట్టులో ఉన్నా అనామకుడిలా కనిపించిన కటింగ్ ఫైనల్‌కు ముందు ఆడింది మూడు మ్యాచ్‌లే. కానీ అసలు మ్యాచ్‌లో అతను హీరోగా అవతరించాడు. 15 బంతుల్లో అతను చేసిన 39 పరుగులు రైజర్స్ భారీ స్కోరుకు బాటలు వేయగా, తర్వాత 2 వికెట్లు తీసి తన విలువను చూపించాడు. ఇక ఎప్పటిలాగే ప్రాణం పెట్టి ఆడిన కెప్టెన్ వార్నర్ మరో అర్ధ సెంచరీతో తన పరుగుల ఆకలిని తీర్చుకున్నాడు. నాయకుడిగా జట్టును గెలిపించి విజయ గర్జన చేశాడు.


 విరాట్ కోహ్లికి సంబంధించి ఇదో విషాదాంత ముగింపు. సీజన్‌లో 973 పరుగులతో ఒంటి చేత్తో జట్టును నడిపించిన అతను చివరి మెట్టుపై కూలిపోయాడు. సొంతగడ్డపైనే బెంగళూరుకు అనూహ్య పరాజయం ఎదురవడం అతడిని చాలా కాలం వెంటాడవచ్చు. గేల్‌తో కలిసి ఒక దశలో సునాయాసంగా గెలుపు దిశగా వెళ్లినా... చివరకు ఓటమినే జీర్ణించుకోవాల్సి వచ్చింది.
 
 
బెంగళూరు: ఐపీఎల్-2016 చాంపియన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్ అవతరించింది. ఆదివారం ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో హైదరాబాద్ 8 పరుగుల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 69; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీకి తోడు బెన్ కటింగ్ (15 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), యువరాజ్ (23 బంతుల్లో 38; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) చెలరేగారు. అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసింది. క్రిస్ గేల్ (38 బంతుల్లో 76; 4 ఫోర్లు, 8 సిక్సర్లు), కోహ్లి (35 బంతుల్లో 54; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) తొలి వికెట్‌కు 63 బంతుల్లోనే 114 పరుగులు జోడించి గట్టి పునాది వేసినా... ఇతర బ్యాట్స్‌మెన్ వైఫల్యం జట్టును దెబ్బ తీసింది. 2013లో ఐపీఎల్‌లోకి అడుగు పెట్టిన సన్‌రైజర్స్ నాలుగో ప్రయత్నంలో టైటిల్ సాధించింది. గతంలో డెక్కన్ చార్జర్స్ పేరుతో ఉన్న హైదరాబాద్ జట్టు 2009లో విజేతగా నిలిచింది.


 కటింగ్ దూకుడు...
24 బంతుల్లోనే అర్ధ సెంచరీ... టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రైజర్స్ కెప్టెన్ వార్నర్ దానికి న్యాయం చేస్తూ బౌండరీలతో చెలరేగిపోయాడు. ఒక వైపు ధావన్ (25 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) నెమ్మదిగా ఆడినా, వార్నర్ జోరుతో సన్ స్కోరు దూసుకుపోయింది. వాట్సన్ వేసిన ఐదో ఓవర్లో 2 సిక్సర్లు, ఫోర్‌తో 19 పరుగులు కొల్లగొట్టిన హైదరాబాద్, గేల్ వేసిన తర్వాతి ఓవర్లో మరో 13 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో స్కోరు 59 పరుగులకు చేరింది. తర్వాతి ఓవర్లోనే ధావన్ వెనుదిరగ్గా, హెన్రిక్స్ (4) కూడా ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. 52 పరుగుల వద్ద కీపర్ రాహుల్ క్యాచ్ వదిలేయడంతో బతికిపోయిన వార్నర్, జోర్డాన్ వేసిన తర్వాతి ఓవర్లో రెండు వరుస ఫోర్లు కొట్టాడు. అయితే అరవింద్ వేసిన బంతిని కట్ చేయబోయి షార్ట్ థర్డ్‌మాన్‌లో క్యాచ్ ఇవ్వడంతో అతని అద్భుత ఇన్నింగ్స్ ముగిసింది. మరో ఎండ్‌లో యువరాజ్ ధాటిని ప్రదర్శిస్తూ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు.

చహల్ ఓవర్లో అతను వరుసగా 4, 6 బాదడంతో స్కోరు వేగం పుంజుకుంది. అయితే కీలక సమయంలో వరుస బంతుల్లో హుడా (3) యువరాజ్ వెనుదిరగడం సన్‌ను దెబ్బ తీసింది. చివర్లో కటింగ్ మెరుపు బ్యాటింగ్‌తో రైజర్స్ 200 పరుగులు దాటింది. వాట్సన్ వేసిన చివరి ఓవర్లో కటింగ్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు బాదడంతో మొత్తం 24 పరుగులు వచ్చాయి. ఆర్‌సీబీ చక్కటి బౌలింగ్‌కు 13-17 ఓవర్ల మధ్య ఐదు ఓవర్లలో 40 పరుగులు మాత్రమే చేసిన రైజర్స్ ఆఖరి 3 ఓవర్లలో 52 పరుగులు రాబట్టింది.


 గేల్ సునామీ...
భారీ లక్ష్య ఛేదనలో బెంగళూరుకు గేల్ అదిరిపోయే ఆరంభం ఇచ్చాడు. భువనేశ్వర్ బౌలింగ్‌లో జాగ్రత్తగానే ఆడినా... బరీందర్ 2 ఓవర్లలో అతను 3 సిక్సర్లు, ఫోర్ బాదడంతో మొత్తం 29 పరుగులు వచ్చాయి. కటింగ్ ఓవర్లోనూ సిక్స్, ఫోర్ కొట్టిన గేల్ 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. ముస్తఫిజుర్ వేసిన ఆరో ఓవర్లో మాత్రం 4 పరుగులు చేసిన బెంగళూరు తర్వాతి మూడు ఓవర్లలో మరింత చెలరేగిపోయింది. ఈ మూడు ఓవర్లలో మొత్తం 41 పరుగులు వచ్చాయి. హెన్రిక్స్ ఓవర్లోనైతే గేల్ 2 సిక్సర్లు, 2 ఫోర్లతో పండగ చేసుకున్నాడు. ఎట్టకేలకు 11వ ఓవర్ మూడో బంతికి గేల్ అవుట్ కావడంతో భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత కోహ్లి తన దూకుడును కొనసాగిస్తూ 32 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. అయితే ఏడు బంతుల వ్యవధిలో కోహ్లి, డివిలియర్స్ (5) అవుట్ కావడంతో బెంగళూరు ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత రాహుల్ (11), వాట్సన్ (11) విఫలం కావడంతో చాలెంజర్స్‌కు ఓటమి తప్పలేదు.


 స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (సి) అబ్దుల్లా (బి) అరవింద్ 69; ధావన్ (సి) జోర్డాన్ (బి) చహల్ 28; హెన్రిక్స్ (సి) చహల్ (బి) జోర్డాన్ 4; యువరాజ్ (సి) వాట్సన్ (బి) జోర్డాన్ 38; హుడా (సి) కోహ్లి (బి) అరవింద్ 3; కటింగ్ (నాటౌట్) 39; ఓజా (రనౌట్) 7; బిపుల్ (సి) చహల్ (బి) జోర్డాన్ 7; భువనేశ్వర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 14;  మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 208.

వికెట్ల పతనం: 1-63; 2-97; 3-125; 4-147; 5-148; 6-158; 7-174.
బౌలింగ్: అరవింద్ 4-0-30-2; గేల్ 3-0-24-0; వాట్సన్ 4-0-61-0; చహల్ 4-0-35-1; అబ్దుల్లా 1-0-10-0; జోర్డాన్ 4-0-45-3.

రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఇన్నింగ్స్: గేల్ (సి) బిపుల్ (బి) కటింగ్ 76; కోహ్లి (బి) బరీందర్ 54; డివిలియర్స్ (సి) హెన్రిక్స్ (బి) బిపుల్ 5; రాహుల్ (బి) కటింగ్ 11; వాట్సన్ (సి) హెన్రిక్స్ (బి) ముస్తఫిజుర్ 11; సచిన్ బేబీ (నాటౌట్) 18; బిన్నీ (రనౌట్) 9; జోర్డాన్ (రనౌట్) 3; అబ్దుల్లా (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 200.

వికెట్ల పతనం: 1-114; 2-140; 3-148; 4-160; 5-164; 6-180; 7-194.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-25-0; బరీందర్ 3-0-41-1; కటింగ్ 4-0-35-2; ముస్తఫిజుర్ 4-0-37-1; హెన్రిక్స్ 3-0-40-0; బిపుల్ 2-0-17-1.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement