హైదరాబాదేసింది | Sunrisers Hyderabad beat Royal Challengers Bangalore by 8 wickets | Sakshi
Sakshi News home page

హైదరాబాదేసింది

Published Tue, Apr 14 2015 12:41 AM | Last Updated on Sun, Sep 3 2017 12:15 AM

హైదరాబాదేసింది

హైదరాబాదేసింది

సన్‌రైజర్స్ బోణీ
 రాయల్ చాలెంజర్స్‌పై విజయం
 చెలరేగిన వార్నర్, శిఖర్ ధావన్

 
 గేల్.. కోహ్లి... డివిలియర్స్... స్యామీ... ఇలా ఏరకంగా చూసినా ఇది ప్రత్యర్థి జడుసుకునే భీకర లైనప్పే. అయితే బౌలింగే తమ ఆయుధంగా భావించిన వార్నర్ టాస్ నెగ్గి మరీ బెంగళూరును బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. తమ నాయకుడి అంచనాకు తగ్గట్టుగానే హైదరాబాదీ బౌలర్లు కోహ్లి బృందం వెన్నులో వణుకు పుట్టించారు. చివరి రెండు ఓవర్లలోనే ఐదుగురు బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్‌కు పంపించి కట్టడి చేశారు. ఓ మాదిరి లక్ష్యాన్ని డేవిడ్ వార్నర్ తన తుఫాన్ ఇన్నింగ్స్‌తో జట్టుకు సునాయాసం చేయగా... ఆ తర్వాత ధావన్, రాహుల్ మిగతా పనిని పూర్తి చేశారు. దాంతో ఐపీఎల్-8లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది.
 
 బెంగళూరు: బౌలర్ల క్రమశిక్షణాయుత బౌలింగ్‌కు... ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (27 బంతుల్లో 57; 6 ఫోర్లు; 4 సిక్సర్లు), శిఖర్ ధావన్ (42 బంతుల్లో 50 నాటౌట్; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) మెరుపు బ్యాటింగ్ తోడవడంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఐపీఎల్‌లో బోణీ కొట్టింది. ఎం.చిన్నస్వామి స్టేడియంలో సోమవారం రాయల్ చాలెంజర్స్ బె ంగళూరు జట్టుతో జరిగిన ఈ మ్యాచ్‌లో వార్నర్ బృందం 8 వికెట్ల తేడాతో గెలిచింది. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బెంగళూరు జట్టు 19.5 ఓవర్లలో 166 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
 
  డి విలియర్స్ (28 బంతుల్లో 46; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), కోహ్లి (37 బంతుల్లో 41; 4 ఫోర్లు; 2 సిక్సర్లు) టాప్ స్కోరర్లుగా నిలువగా... గేల్ (16 బంతుల్లో 21; 3 ఫోర్లు; 1 సిక్స్) నిరాశపరిచాడు. బౌల్ట్‌కు మూడు, భువనేశ్వర్, రవి బొపారాలకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 17.2 ఓవర్లలో 2 వికెట్లకు 172 పరుగులు చేసింది. ధావన్‌కు అండగా నిలిచిన కేఎల్ రాహుల్ (28 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు; 1 సిక్స్) వేగంగా ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు అజేయంగా 78 పరుగులు జోడించారు. వార్నర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ పురస్కారం దక్కింది.
 
 బౌలర్ల హవా...
 తమ తొలి మ్యాచ్‌లో కోల్‌కతాపై విధ్వంసం సృష్టించిన గేల్  ఈసారి ప్రభావం చూపలేకపోయాడు. ప్రారంభ ఓవర్‌లోనే ఓ భారీ సిక్స్‌తో ఆకట్టుకుని శుభారంభమే ఇచ్చినా ప్రవీణ్ బౌలింగ్‌లో సునాయాస క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పదో ఓవర్‌లో కోహ్లి వరుసగా 4, 6తో టచ్‌లో కన్పించాడు. అంతకుముందు తొమ్మిదో ఓవర్‌లో కోహ్లి ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను కరణ్ శర్మ వదిలేశాడు. అయితే 11వ ఓవర్‌లో దినేశ్ కార్తీక్ (11 బంతుల్లో 9; 1 ఫోర్) మరోసారి విఫలమై అవుట్ కాగా 12వ ఓవర్‌లో జట్టుకు గట్టి దెబ్బే తగిలింది. రవి బొపారా తన చివరి రెండు బంతుల్లో ఊపు మీదున్న కోహ్లి, మన్‌దీప్ సింగ్‌ను అవుట్ చేసి షాక్ ఇచ్చాడు. ఇక ఈ దశలో డి విలియర్స్ ఇన్నింగ్స్ బాధ్యతను తీసుకున్నాడు. బొపారా బౌలింగ్‌లో డి విలియర్స్ ఇచ్చిన క్యాచ్‌ను ధావన్ పట్టుకున్నప్పటికీ నియంత్రణ కోల్పోయి బౌండరీ ఆవల కాలు పెట్టడంతో సిక్స్‌గా మారింది. తొలి మ్యాచ్ ఆడిన తెలుగు క్రికెటర్ ఆశిష్ రెడ్డి తన తొలి ఓవర్‌లోనే స్యామీని బౌల్డ్ చేసి ఆకట్టుకున్నాడు. డి విలియర్స్, అబాట్ (9 బంతుల్లో 14; 1 ఫోర్; 1 సిక్స్)ను బౌల్ట్ వరుస బంతుల్లో అవుట్ చేయడంతో పాటు అదే ఓవర్‌లో హర్షల్ పటేల్ (2)ను కూడా వెనక్కి పంపాడు. ఇక చివరి ఓవర్‌లో భువనేశ్వర్ రెండు వికెట్లు తీయడంతో బెంగళూరు 166 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఓవరాల్‌గా సన్‌రైజర్స్ బౌలర్ల ధాటికి 14 పరుగులకే చివరి ఐదు వికెట్లు కుప్పకూల డం విశేషం.
 
 వార్నర్ విధ్వంసం
 సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే తారజువ్వలా సాగింది. తొట్టతొలి బంతినే వార్నర్ బౌండరీకి తరలించగా... ధావన్ కూడా రెండు ఫోర్లు బాదడంతో 16 పరుగులు వచ్చాయి. ఇక రెండో ఓవర్‌లో వార్నర్ మరింత రెచ్చిపోయాడు. వరుసగా మూడు ఫోర్లు, ఓ సిక్స్ బాది 20 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత ఆరోన్ బౌలింగ్‌లో రెండు ఫోర్లు, సిక్స్ కొట్టడంతో జట్టు ఐదో ఓవర్‌లోనే 58 పరుగులు సాధించింది. అయితే 24 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వార్నర్ జోరును చాహల్ ఎల్బీడబ్ల్యుతో ముగించాడు. తొలి వికెట్‌కు వీరు 7.5 ఓవర్లలో 82 పరుగులు జోడించారు. విలియమ్సన్ (5) త్వరగానే అవుటైనా కేఎల్ రాహుల్ అండతో ధావన్ నిలకడగా ఆడాడు. ఎక్కడా తడబాటుకు లోనుకాకుండా పరుగులు రాబట్టాడు. అటు రాహుల్ కూడా చక్కని షాట్లతో అలరించాడు. ఈ జోడి స్ట్రయిక్ రొటేట్ చేసుకుంటూ వెళ్లింది. 17వ ఓవర్‌లో భారీ సిక్స్ కొట్టి ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. మరుసటి ఓవర్‌లో రాహుల్ 4, 6తో జట్టు విజయాన్ని ఖరారు చేశాడు.
 
 స్కోరు వివరాలు
 బెంగళూరు రాయల్ చాలెంజర్స్ ఇన్నింగ్స్: గేల్ (సి) ఆశిష్ రెడ్డి (బి) ప్రవీణ్ కుమార్ 21; కోహ్లి (బి) బొపారా 41; దినేశ్ కార్తీక్ (సి) విలియమ్సన్ (బి) కరణ్ శర్మ 9; డి విలియర్స్ (సి) ధావన్ (బి) బౌల్ట్ 46; మన్‌దీప్ సింగ్ (సి) వార్నర్ (బి) బొపా రా 0; స్యామీ (బి) ఆశిష్ రెడ్డి 6; అబాట్ (సి) కరణ్ (బి) బౌల్ట్ 14; పటేల్ (సి) విలియమ్సన్ (బి) బౌల్ట్ 2; అహ్మద్ (బి) భువనేశ్వర్ 4; ఆరోన్ (బి) భువనేశ్వర్ 6; చాహల్ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (19.5 ఓవర్లలో ఆలౌట్) 166
 
 వికెట్ల పతనం: 1-43, 2-77, 3-93, 4-93, 5-125, 6-152, 7-152, 8-155, 9-165, 10-166.
 బౌలింగ్: బౌల్ట్ 4-0-36-3; భువనేశ్వర్ 3.5-0-30-2; ప్రవీణ్ 4-0-34-1; బొపారా 3-0-31-2; కరణ్ 4-0-20-1; ఆశిష్ 1-0-11-1.
 
 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ ఎల్బీడబ్ల్యు (బి) చాహల్ 57; ధావన్ నాటౌట్ 50; విలియమ్సన్ (స్టం ప్డ్) దినేశ్ కార్తీక్ (బి) చాహల్ 5; రాహుల్ నాటౌట్ 44; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (17.2 ఓవర్లలో రెండు వికెట్లకు) 172
 
 వికెట్ల పతనం: 1-82, 2-94.  
 బౌలింగ్: సీన్ అబాట్ 2-0-21-0; హర్షల్ పటేల్ 2- 0-23-0; వరుణ్ ఆరోన్ 3.2-0-36-0; అహ్మద్ 4-0-41-0; స్యామీ 2-0-18-0; చాహల్ 4-0-28-2.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement