గంభీర్ గర్జన | Sunrisers Hyderabad versus Kolkata Knight Riders | Sakshi
Sakshi News home page

గంభీర్ గర్జన

Published Sun, Apr 17 2016 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM

గంభీర్ గర్జన

గంభీర్ గర్జన

నైట్‌రైడర్స్ అలవోక విజయం   
8 వికెట్లతో ఓడిన సన్‌రైజర్స్

 సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో అందరూ కలిసి 9 ఫోర్లు కొడితే... కోల్‌కతా కెప్టెన్ గౌతం గంభీర్ ఒక్కడే 13 ఫోర్లు బాదాడు. మ్యాచ్‌పై అతని ఆధిపత్యం ఎలా సాగిందనేదానికి ఇది ఉదాహరణ. ముందు మెరుగైన బౌలింగ్ వ్యూహాలతో రైజర్స్‌ను కట్టడి చేసిన అతను... ఆ తర్వాత చక్కటి బ్యాటింగ్‌తో జట్టును నడిపించి మ్యాచ్‌ను పూర్తిగా ఏకపక్షంగా మార్చేశాడు. ఫలితంగా ఐపీఎల్-9లో కోల్‌కతాకు రెండో విజయం దక్కగా, హైదరాబాద్‌కు వరుసగా రెండో ఓటమి ఎదురైంది.

నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ ఈ మ్యాచ్‌కు ముందు హైదరాబాద్‌లో చివరిసారిగా 2014 ఐపీఎల్‌లో తలపడ్డాయి. నాడు కూడా సన్‌రైజర్స్ సరిగ్గా 142 పరుగులే చేస్తే... గంభీర్ సేన అలవోకగా లక్ష్యాన్ని ఛేదించి 7 వికెట్లతో నెగ్గింది. సీజన్ మారినా ఫలితంలో మాత్రం మార్పు లేదు.

సాక్షి, హైదరాబాద్: ఐపీఎల్‌లో సొంతగడ్డపై విజయాల బోణీ చేయాలనుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆశ నెరవేరలేదు. గంభీర్ సేన జోరు ముందు లీగ్‌లో సన్‌కు వరుసగా రెండో ఓటమి తప్పలేదు. శనివారం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ 8 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.

ఇయాన్ మోర్గాన్ (43 బంతుల్లో 51; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), నమన్ ఓజా (28 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఉమేశ్ యాదవ్‌కు 3 వికెట్లు దక్కాయి. అనంతరం కోల్‌కతా 18.2 ఓవర్లలో 2 వికెట్లకు 146 పరుగులు చేసింది. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గౌతం గంభీర్ (60 బంతుల్లో 90 నాటౌట్; 13 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగాడు. గంభీర్, ఉతప్ప (34 బంతుల్లో 38; 3 ఫోర్లు, 1 సిక్స్) కలిసి తొలి వికెట్‌కు 75 బంతుల్లో 92 పరుగులు జత చేయడంతో జట్టుకు ఛేదనలో ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. తమ తర్వాతి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ సోమవారం ముంబైతో ఇదే మైదానంలో ఆడుతుంది.

 ఆదుకున్న మోర్గాన్, ఓజా
సన్‌రైజర్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ (6) మరోసారి విఫలం కాగా... ఇన్నింగ్స్ రెండో బంతికే అవుటైనా నోబాల్ కావడంతో బతికిపోయిన వార్నర్ (13) ఆ అవకాశాన్ని పెద్దగా ఉపయోగించుకోలేకపోయాడు. వీరిద్దరు ఐదు బంతుల వ్యవధిలో అవుట్ కాగా, హెన్రిక్స్ (6), హుడా (6)  కూడా నిలవలేకపోయారు. పవర్‌ప్లేలో హైదరాబాద్ 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. 50 పరుగులకు 4 వికెట్లు కోల్పోయిన దశలో సన్‌రైజర్స్‌ను మోర్గాన్, ఓజా ఆదుకున్నారు. వీరిద్దరు కొన్ని చక్కటి షాట్లతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. ముఖ్యంగా నరైన్ బౌలింగ్‌లో మోర్గాన్ వరుసగా రెండు ఫోర్లు, ఓజా సిక్సర్ కొట్టి ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశారు. మోర్కెల్ బౌలింగ్‌లో ఇద్దరూ చెరో సిక్స్ బాదారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 47 బంతుల్లో 67 బౌలింగ్‌లో జోడించిన తర్వాత రసెల్ అద్భుత ఫీల్డింగ్ నైపుణ్యానికి ఓజా వెనుదిరిగాడు. మరుసటి ఓవర్లోనే మోర్గాన్ కూడా అవుటయ్యాడు. 13 ఓవర్ల వరకు ఒక్క ఓవర్‌లోనూ పదికి మించి పరుగులు రాబట్టలేకపోయిన హైదరాబాద్, చివరి ఐదు ఓవర్లలో 48 పరుగులు చేయడంతో కాస్త గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది.

 గంభీర్ దూకుడు

 ఐపీఎల్‌లో అత్యంత విజయవంతమైన ఓపెనింగ్ జోడీలలో ఒకటైన గంభీర్, ఉతప్ప మరోసారి నైట్‌రైడర్స్‌కు శుభారంభం అందించారు. వీరిద్దరు ఏ దశలోనూ ఇబ్బందికి లోను కాకుండా సాధికారికంగా ఆడటంతో తొలి పది ఓవర్లలో జట్టు స్కోరు 72 పరుగులకు చేరింది. లీగ్‌లో ఈ జంట 9వ సారి అర్ధసెంచరీ భాగస్వామ్యం నెలకొల్పడం విశేషం. ఈ క్రమంలో గంభీర్ టి20ల్లో 5 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. కరణ్ వేసిన ఓవర్లో మూడు ఫోర్లు బాది జోరు పెంచిన గంభీర్ 41 బంతుల్లో హాఫ్ సెంచరీని చేరుకున్నాడు. ఎట్టకేలకు ఉతప్పను అవుట్ చేసి ఆశిష్ ఈ భాగస్వామ్యాన్ని విడగొట్టగా, కొద్ది సేపటికే ముస్తఫిజుర్ అద్భుత బంతితో రసెల్ (2) వికెట్లను గిరాటేశాడు. అయితే మరో వైపు దూకుడును కొనసాగించిన గంభీర్ తన జట్టుకు రెండో విజయాన్ని అందించాడు. రెండో వికెట్ పడిన సమయానికి కోల్‌కతా విజయం కోసం 46 పరుగులు కావాల్సి ఉండగా, గంభీర్ ఒక్కడే 6 ఫోర్లు, 1 సిక్సర్ బాదాడు.

 స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్: వార్నర్ (సి) సూర్యకుమార్ (బి) ఉమేశ్ 13; ధావన్ (సి) ఉతప్ప (బి) మోర్కెల్ 6; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) ఉమేశ్ 6; మోర్గాన్ (సి) షకీబ్ (బి) ఉమేశ్ 51; హుడా (సి) ఉమేశ్ (బి) రసెల్ 6; ఓజా (సి) చావ్లా (బి) మోర్కెల్ 37; ఆశిష్ రెడ్డి రనౌట్ 13; కరణ్ నాటౌట్ 2; భువనేశ్వర్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 142.

 వికెట్ల పతనం: 1-18; 2-23; 3-36; 4-50; 5-117; 6-128; 7-141.

 బౌలింగ్: మోర్కెల్ 4-0-35-2; ఉమేశ్ 4-0-28-3; షకీబ్ 3-0-18-0; రసెల్ 4-0-19-1; నరైన్ 4-0-26-0; చావ్లా 1-0-13-0.

 కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్: ఉతప్ప (ఎల్బీ) (బి) ఆశిష్ 38; గంభీర్ (నాటౌట్) 90; రసెల్ (బి) ముస్తఫిజుర్ 2; పాండే (నాటౌట్) 11; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.2 ఓవర్లలో 2 వికెట్లకు) 146.

 వికెట్ల పతనం: 1-92; 2-97.

 బౌలింగ్: భువనేశ్వర్ 4-0-29-0; శరణ్ 4-0-31-0; ముస్తఫిజుర్ 4-0-29-1; కరణ్ 2.2-0-24-0; హెన్రిక్స్ 2-0-19-0; ఆశిష్ రెడ్డి 2-0-14-1. 


సూపర్ క్యాచ్

ఐపీఎల్‌లో రిలే క్యాచ్‌లు పట్టడం కొత్త కాకపోయినా... శనివారం మ్యాచ్‌లో కోల్‌కతా ఆటగాడు రసెల్ మరో సారి ఆ ఫీట్‌ను అద్భుతంగా చేసి చూపించాడు. మోర్కెల్ బౌలింగ్‌లో నమన్ ఓజా భారీ షాట్ కొట్టగా, బంతి గాల్లోకి చాలా ఎత్తున లేచింది. లాంగాన్‌లో ఉన్న రసెల్ అనూహ్యంగా తన ఎడమ వైపు చాలా దూరం పరుగెత్తుకొచ్చాడు. ఎట్టకేలకు ఎడమ చేత్తో దానిని అందుకున్న అతను నియంత్రణ కోల్పోయాడు. సరిగ్గా గాల్లో ఉన్న సమయంలో బంతిని మళ్లీ బౌండరీ లోపలికి విసిరేసి తప్పుకున్నాడు. దానిని కాస్త తడబడుతూనే అయినా చావ్లా అందుకోవడంతో ఓజా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ తర్వాత రసెల్ ప్రేక్షకుల వైపు వంగి రెండు చేతులూ జోడించి పదే పదే నమస్కారాలు చేయడం ఆకట్టుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement