కోల్‌కతా ఓటమికి వారే కారణం!
- బాట్స్‌మన్లను నిందించిన గంభీర్..
- యూవీలా ఒక్కరూ కూడా ఆడలేదని ఆవేదన
ఎన్నో అంచనాలతో, ఒకింత ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగిన కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ షాకిచ్చింది. లీగ్‌లో రెండుసార్లు హైదరాబాద్‌ను ఓడించిన గంభీర్ సేన.. కీలకమైన ఎలిమినేటర్ లో మాత్రం భారీ తేడాతో చిత్తయింది. 2012, 2014లో ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచిన ఆ జట్టు తాజాగా హైదరాబాద్ విసిరిన 163 పరుగులు లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడింది.
బుధవారం ఢిల్లీలోని ఫిరోజ్‌షా కోట్ల మైదానంలో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో ఆధిపత్యం ప్రదర్శిస్తూ హైదరాబాద్ జట్టు కోల్‌కతాకు ఇంటిదారిని చూపెట్టింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ గౌతం గంభీర్ విలేకరులతో మాట్లాడుతూ తమ జట్టు ఓటమికి బాట్స్‌మన్ వైఫల్యమే కారణమని చెప్పాడు. లక్ష్యఛేదనలో బలమైన భాగస్వామ్యాలను నెలకొల్పడంలో కోల్‌కతా బ్యాట్స్‌మన్ విఫలయ్యారని చెప్పుకొచ్చాడు.
'మేం భారీ భాగస్వామ్యాలను ఏర్పాటుచేయలేకపోయాం. యువరాజ్ తరహాలో ఒక్కరూ కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు. యూపీ అర్ధ సెంచరీ చేయకున్నా అతడి అసాధారణ ఇన్నింగ్స్ మ్యాచ్ గతిని మార్చేసింది' అని గంభీర్ విశ్లేషించాడు. తమ బ్యాట్స్‌మెన్‌లో ఒక్కరైనా 60 లేదా 70 పరుగులు చేసి ఉంటే తాము గెలిచేవాళ్లమని చెప్పాడు. ఇప్పటివరకు కోల్‌కతా జట్టు బ్యాటింగ్ లైనఫ్‌పైనే ఆధారపడి విజయాలు సాధిస్తూ వచ్చిందని, కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో మాత్రం అంచనాలు నిలబెట్టడంలో బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఫిరోజ్ షా పిచ్‌పై 160 పరుగుల లక్ష్యం పెద్దదేమీ కాదని, బ్యాట్స్‌మన్ నిలబడితే దీనిని ఛేదించవచ్చునని, అయితే, హైదరాబాద్ జట్టు తమను సమర్థంగా నిరోధించిందని అన్నాడు. ఆల్ రౌండర్ అండ్రూ రస్సెల్ జట్టులో లేకపోవడం కూడా తమను దెబ్బతీసిందని గంభీర్ అన్నాడు.